Lay offs: గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో లేఆఫ్.. దాదాపు 1800 మంది ఔట్

by Harish |   ( Updated:2024-08-31 08:27:47.0  )
Lay offs: గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో లేఆఫ్.. దాదాపు 1800 మంది ఔట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమైంది. వార్షిక సమీక్ష ప్రక్రియలో పనితీరు ఆధారంగా మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 3 నుంచి 4 శాతం అంటే దాదాపు 1,300 నుంచి 1,800 వరకు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన తొలగింపులు బ్యాంక్‌లోని వివిధ విభాగాలపై ప్రభావం చూపుతాయని ఒక నివేదిక పేర్కొంది. ప్రస్తుత పోటీ మార్కెట్లో తక్కువ పనితీరు కనబరిచే వారిని వార్షిక సమీక్షలో భాగంగా గుర్తించాం. 2023 కంటే ఈ ఏడాది లేఆఫ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన బ్యాంకుల్లో ఇలాంటి వర్క్‌ఫోర్స్ సర్దుబాట్లు సర్వసాధారణం అని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ప్రతినిధి టోనీ ఫ్రాట్టో ఒక ప్రకటనలో అన్నారు.

ఇతర ప్రధాన బ్యాంకులు కూడా ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నాయని, పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను గుర్తించడం, తొలగించడం జరుగుతుందని ఫ్రాట్టో చెప్పారు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌ మునుపటి సంవత్సరంలో తన వర్క్‌ఫోర్స్‌లో 1 శాతం నుండి 5 శాతం మందిని తొలగించింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి సంస్థలో 44,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అతిపెద్ద అమెరికా బ్యాంకులు సవాళ్లతో కూడిన ఆర్థిక వాతావరణంలో ఖర్చులను తగ్గించడానికి ఏకంగా 5,000 ఉద్యోగాలను తగ్గించాయి, సిటీ గ్రూప్ 2,000 మందిని తొలగించింది.

Advertisement

Next Story

Most Viewed