Gold Loans: త్వరలో బంగారు రుణాలకూ ఈఎంఐ ఆప్షన్

by S Gopi |   ( Updated:2024-11-19 13:25:23.0  )
Gold Loans: త్వరలో బంగారు రుణాలకూ ఈఎంఐ ఆప్షన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలామంది తక్షణం చూసేది బంగారం తాకట్టు వైపే. ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్ సురక్షితం కావడంతో ఎక్కువ మంది దీన్ని మొదటి ఎంపికగా చూస్తారు. అయితే, బంగారు రుణాలను చెల్లించడంలో లోపాలను గుర్తించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వాటిని సరిదిద్దాలని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు సూచించింది. దీనికోసం పరిశ్రమ బంగారు రుణాలకు కూడా నెలవారీ చెల్లింపుల్లో(ఈఎంఐ) పూర్తి చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో వడ్డీ, అసలు కలిపి చెల్లింపులు చేసే సౌకర్యాన్ని వినియోగదారులకు లభించనుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో గోల్డ్ లోన్‌లపై కస్టమర్లు కాలపరిమితి తర్వాత మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదా గడువు కంటే ముందు అసలు, వడ్డీ మొత్తం చెల్లించి రుణాన్ని పూర్తిచేయవచ్చు. అయితే, గోల్డ్ లోన్‌లకు సంబంధించి లోపాలు ఉన్నట్టు ఆర్‌బీఐ గుర్తించింది. తాకట్టులో ఉన్న బంగారం వేలం ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడం, వడ్డీ చెల్లించి అసలును ఎక్కువ కాలం కొనసాగించే పద్దతిని అనుసరిస్తున్నట్టు ఆర్‌బీఐ పరిశీలించింది. దీన్ని పరిష్కరించేందుకు ఈఎంఐ విధానాన్ని ఆర్‌బీఐ ప్రస్తావించింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2024-25లో సెప్టెంబర్ 20 నాటికే దేశీయంగా ఉన్న బ్యాంకులు సుమారు రూ.1.4 లక్షల కోట్ల విలువైన గోల్డ్ లోన్‌లు ఇచ్చాయి. ఇది గతేడాది కంటే దాదాపు 15 శాతం అధికం.

Advertisement

Next Story

Most Viewed