ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన మస్క్

by Harish |   ( Updated:2024-06-03 07:35:58.0  )
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన మస్క్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. అంతకుముందు ఈ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉండగా, మస్క్ సంపద భారీగా పెరగడంతో నికర విలువ $210.7 బిలియన్లకు చేరుకుంది. ఇదే సమయంలో జాబితాలో LVMH అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ $201 బిలియన్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆ తరువాత మూడో స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ $197.4 బిలియన్లతో మూడవ స్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా దిగ్గజం మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ జాబితా ప్రకారం, $163.9 బిలియన్లతో నాలుగో స్థానంలో, లారీ ఎల్లిసన్ $146.2 బిలియన్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు.

52 ఏళ్ల ఎలాన్ మస్క్ తన సంపదలో ఎక్కువ భాగం టెస్లాలో, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో కలిగి ఉన్నాడు. అక్టోబర్ 2022లో సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి తన టెస్లా షేర్లను విక్రయించాడు, ఆ సమయంలో మస్క్ సంపద భారీగా తగ్గింది. ఆ తర్వాత కొంత మేరకు పుంజుకున్నప్పటికి టెస్లాకు ప్రధాన మార్కెట్ అయిన చైనాలో కార్ల అమ్మకాలు తగ్గిపోవడం, అలాగే దాని ప్లాంట్‌లలో ఒకదానిపై దాడి చేయడం కారణంగా మస్క్ సంపద భారీగా క్షీణించింది. దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన మస్క్ తాజాగా తన సంపదను పెంచుకుంటూ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు.

మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ 2020 నుండి గంటకు 14 మిలియన్ డాలర్ల చొప్పున తమ సంపదను పెంచుకున్నారని గతంలో ఒక నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ $116.4 బిలియన్లతో 11 వ స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed