బడ్జెట్‌లో సామాన్యుల ఆశలు నెరవేరుతాయా!

by S Gopi |
బడ్జెట్‌లో సామాన్యుల ఆశలు నెరవేరుతాయా!
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో అన్ని వర్గాలు, రంగాల నుంచి అభ్యర్థనలు పెరిగాయి. ఎప్పటిలాగే, పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు ఆదాయ పన్ను నిబంధనలలో మార్పుల చేయాలని ఆశిస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం సమగ్ర బడ్జెట్‌ను తీసుకొస్తుంది. మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి గణనీయమైన విధాన మార్పులు చేయనప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరుపై దృష్టి సారించనుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం పన్ను విధానంలో ఉన్న ఏడు శ్లాబ్‌లపై సామాన్యులు మార్పులను ఆశిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో పన్ను చెల్లింపుదారులు ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలను పరిగణలోకి తీసుకుని సర్దుబాట్లు చేయాలని కోరుతున్నారు. సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా పన్ను శ్లాబ్‌లో మార్పులను ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉంది. దానివల్ల తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై పన్నుల భారం తగ్గుతుంది. అదనంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వృద్ధికి అనుగుణంగా పన్ను శ్లాబ్‌ల విషయంలో మరింత సులభమైన మార్పులను చేపట్టవచ్చు.

సెక్షన్ 80సీ కింద మినహాయింపు పెంపు..

ప్రస్తుతం సెక్షన్ 80 సీసీఈ ప్రకారం.. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ(1) కింద లభించే మినహాయింపులు ఏడాదికి రూ .1.50 లక్షలుగా ఉంది. 2014 నుంచి ఇదే కొనసాగుతోంది. వాస్తవానికి 2003 వరకు ఈ పరిమితి రూ. లక్షగా ఉండేది. రూ.లక్ష పరిమితిని నిర్ణయించి దాదాపు 18 ఏళ్లు అవుతోంది. ఇది 2014లో 50 శాతం మాత్రమే పెరిగింది. అంటే.. వార్షికంగా 3 శాతం కంటే తక్కువ. ఈ వార్షిక సగటు పెరుగుదల అనేది ఇదే కాలంలో సగటు ద్రవ్యోల్బణంతో సమానంగా లేదు. ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో దీన్ని రూ.2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్​పీఎస్​ విత్‌డ్రాపై నిబంధనలు..

ప్రస్తుత ఉన్న చట్టం ప్రకారం, ఎన్‌పీఎస్ ఖాతాను మూసివేసే సమయంలో ఖాతా నుంచి 60 శాతం విత్‌డ్రాకు మాత్రమే మినహాయింపు ఉంది. మిగిలిన మొత్తానికి యాన్యుటీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. 40 శాతం కార్పస్‌తో యాన్యుటీ కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం తొలగించాలని, ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే నిర్ణయాన్ని చందాదారుడికే వదిలేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Advertisement

Next Story