Amazon India: ఐపీఓకు అమెజాన్ ఇండియా

by S Gopi |
Amazon India: ఐపీఓకు అమెజాన్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన భారత యూనిట్‌ను స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయనుంది. దీనికోసం ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో భారత స్టాక్ మార్కెట్లలో అమెజాన్ తొలి పబ్లిక్ ఇష్యూ కానుంది. ఇప్పటికే అమెరికా వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ జేపీ మోర్గాన్‌తో పాటు భారత్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో అమెజాన్ చర్చలు మొదలుపెట్టింది. ప్రధానంగా స్థానికంగానే డేటాను నిర్వహించడం, ఇన్వెంటరీల కోసం అమెజాన్ ఇండియా ఐపీఓకు సిద్ధమవుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. దేశీయ ఈ-కామర్స్ కంపెనీలు మాత్రమే ఇన్వెంటరీ మోడళ్లు ఉండాలి. విదేశీ కంపెనీలు కస్టమర్లు, విక్రేతల మధ్య మధ్యవర్తిగా పనిచేసే మార్కెట్‌ప్లే మోడల్‌గా మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ నిబంధనలను పాటించడం ద్వారా వేగవంతమైన డెలివరీ సేవలను అందించవచ్చని, షిప్పింగ్ ఖర్చులను తగ్గించవచ్చని అమెజాన్ భావిస్తోంది. ఐపీఓ వల్ల డేటా లోకలైజేషన్, ఇన్వెంటరీ మోడల్ సవాళ్లను అధిగమించవచ్చు. సాంకేతికంగానే కాకుండా దేశీయ ఈ-కామర్స్ వ్యాపారంలో అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ నుంచి గట్టి పోటీ ఉంది. ప్రధానంగా టైర్2 సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఫ్లిప్‌కార్ట్ పట్టు సాధిస్తున్న నేపథ్యంలో అమెజాన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని భావిస్తోంది. దీనికోసం సింగపూర్‌లో ఉన్న తన హోల్డింగ్ కంపెనీని కూడా భారత్‌కు తరలించే పనిలో ఉంది. అనంతరం 2025 లేదా 2026 లోగా అమెజాన్ ఇండియా ఐపీఓకు రానుంది. మరోవైపు, దేశంలో వేగంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ కంపెనీల నుంచి పోటీ కూడా అమెజాన్ తాజా నిర్ణయానికి కారణం అయ్యుండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story