2030 నాటికి 8 లక్షల కార్ల ఎగుమతులు: మారుతీ సుజుకి

by Harish |   ( Updated:2024-04-07 08:20:21.0  )
2030 నాటికి 8 లక్షల కార్ల ఎగుమతులు: మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతీ సుజుకి గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఎగుమతులు సాధించిన నేపథ్యంలో 2030 నాటికి 8 లక్షల కార్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల కార్ల ఎగుమతుల లక్ష్యాన్ని దాటుతామని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. కంపెనీ తన మార్కెట్‌ను పెంచుకోడానికి డీలర్‌షిప్‌ల వద్ద బ్యాంక్ ఫైనాన్స్‌ను అందుబాటులో ఉంచడం, సేవా సౌకర్యాలను బలోపేతం చేయడం, ఎగుమతి మార్కెట్‌లకు విడిభాగాల లభ్యతను బలోపేతం చేయడం ద్వారా 100 దేశాలకు పైగా విస్తరించి ఉన్న తన మార్కెట్‌‌లో మరిన్ని మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది.

మూడేళ్ల క్రితం వరకు ఎగుమతులు సంవత్సరానికి 1 నుండి 1.2 లక్షల కార్ల పరిధిలో ఉండేవి. అవి 2022-23లో 2.59 లక్షల యూనిట్లకు, 2023-24లో 2.83 లక్షల ఎగుమతులకు చేరుకున్నాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి అన్నారు. మిగిలిన కార్ల పరిశ్రమ ఎగుమతులు వాస్తవానికి 3 శాతం తగ్గినప్పటికీ మారుతీ సుజుకి మాత్రం ఏడాదికి 9.3 శాతం పెరిగి 2.83 లక్షల యూనిట్లకు వృద్ధి చెందగలిగింది. భారత్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న కార్లలో 42 శాతం మారుతీ సుజుకి నుండే ఉన్నాయని రాహుల్ భారతి పేర్కొన్నారు.

పర్యావరణాన్ని రక్షించడానికి ఈవీ కార్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఈవీని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నారు. 2024లో మారుతీ సుజుకి 2,83,067 యూనిట్ల రికార్డు ఎగుమతులను నమోదు చేసింది, ఇది 2023 లో 2,59,333 యూనిట్ల కంటే ఎక్కువ. 2022 ఎగుమతులు 2,38,376 యూనిట్లుగా ఉన్నాయి.

Advertisement

Next Story