అసమర్థ ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలి.. BSP డిమాండ్

by Shyam |
BSP leaders
X

దిశ, హుస్నాబాద్: భూమి హద్దులు చూపించలేని అసమర్థ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డి సమ్మయ్య డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో 2017లో నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని శుక్రవారం బీఎస్పీ నాయకులు పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 35 మంది పేదలకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించిందని తెలిపారు. కానీ, నేటికీ ఆ భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని, అంతేగాకుండా.. రైతుబంధు కూడా వర్తించడం లేదని అన్నారు. దీంతో సదరు భూమి హద్దులు చూపించాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయం ఎదుట మహంకాళి శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

అయినా.. మూడేళ్లుగా హద్దులు చూపించకుండా, ఎమ్మెల్యే, మంత్రి, రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు స్పందించి లబ్ధిదారులకు ఇచ్చిన భూమికి హద్దులు చూపించాలని, లేనిపక్షంలో క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ కుటుంబాన్ని బీఎస్పీ బృందం పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నిషాని రామచంద్రం, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అనిల్, మల్లేశం, సంపత్, రాజమల్లు, రాజు, అభిలాష్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story