తల్లికి కరోనా.. బిడ్డకు శ్రీరామరక్ష

by Shyam |   ( Updated:2021-09-30 01:42:07.0  )
తల్లికి కరోనా.. బిడ్డకు శ్రీరామరక్ష
X

దిశ, ఫీచర్స్: పసిబిడ్డకు అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతమే ‘అమ్మ పాలు’. సహజ సిద్ధమైన మొదటి వ్యాక్సిన్‌గా పరిగణించే తల్లిపాలు, శిశువులోని అన్ని అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. జీవిత కాలానికి సరిపడే వ్యాధి నిరోధకశక్తిని పెంచే గ్లోబ్యులిన్‌ అనే ప్రోటిన్‌ తల్లిపాలలో అధికంగా ఉండగా, అమ్మపాలు బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. ఎలర్జీ, ఆస్తమా ఇతరత్రా అనారోగ్యాలు రాకుండా అడ్డుకునే తల్లిపాలు ఇకపై కొవిడ్‌ మహమ్మారిని కూడా నిరోధించగలవని కొత్త అధ్యయనంలో తేలింది. పిల్లలకు పాలిచ్చే మహిళలు కొవిడ్ బారిన పడి కోలుకుంటే, వారి పాలలో 10 నెలల వరకు ప్రతిరోధకాలను స్రవిస్తూనే ఉంటాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

తల్లి పాలలో ప్రధాన యాంటీబాడీ ఇమ్యునో గ్లోబ్యులిన్‌ A (IgA) కాగా ఇది పిల్లల శ్వాసకోశ, పేగు మార్గాల లైనింగ్‌కు అంటుకుని, వైరస్‌, బ్యాక్టీరియాలు వారి శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందని తెలిసిన విషయమే. అయితే కొవిడ్ విషయంలో ‘తల్లిపాలు’ ఎలా పనిచేస్తాయని న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రెబెక్కా పావెల్, ఆమె బృందం ఇటీవలే ఓ అధ్యయనం చేపట్టింది. అధ్యయనం కోసం కొవిడ్ నుంచి కోలుకున్న 75 మంది మహిళల రొమ్ము పాల నమూనాలను విశ్లేషించారు. వాళ్లు 88 శాతం IgA యాంటీబాడీస్ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాదు టీకాలు వేసిన మహిళలకు, వారి పాలలో వైరస్-స్పెసిఫిక్ యాంటిబాడీలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

‘పిల్లలకు ఆయా తల్లులు ఇప్పటికే పాలను పట్టిస్తుంటే, ఆ చిన్నారులకు ఆ ప్రతిరోధకాలను అందిస్తున్నట్లే. ఇది నమ్మశక్యం కాని చికిత్స కావచ్చు కానీ వాస్తవంగా కొవిడ్‌ను ఇవి అడ్డుకోగలవు. ఈ ప్రతిరోధకాలు శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంతో పాటు ఈ యాంటీబాడీలను తీవ్రమైన కొవిడ్ ఉన్న వ్యక్తులకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే కొవిడ్ ఇన్‌ఫెక్షన్ చికిత్సలో తల్లి పాల నుంచి పొందిన IgA వ్యాల్యును తనిఖీ చేయడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం. ఇక ఇతర టీకాలతో పోలిస్తే ఆర్‌ఎన్‌ఏ టీకాల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఇన్‌ఫెక్షన్ నుంచి మిమ్మల్ని రక్షించడానికి మీకు అంత యాంటీబాడీ అవసరం లేదు.
– డాక్టర్ జోసెఫ్ న్యూ, అధ్యయన రచయిత, నియోనాటాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed