కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-10-09 12:01:02.0  )
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మిత్ర భేధమే తప్ప శత్రు భేధం లేదని, వాటాల పంపకంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య గొడవ నడుస్తోందని విమర్శలు గుప్పించారు. నేడు హైదర్‌గూడలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏఐసీసీ సెక్రటరీలతో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, రాంరెడ్డి దామోదర్ రెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం ప్రజలకు గుండ్లు కొట్టి డబ్బులు పంచుకున్నట్లే టీఆర్ఎస్, బీజేపీల యవ్వారం ఉందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. గులాబీ వసూళ్లపై సెంట్రల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఓటుకు రూ.30 నుంచి 40 వేలు పంచుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ దేశమంతా నాది అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు అరాచక శక్తులుగా మారాయని అన్నారు. టీఆర్ఎస్‌పై తాను వేసిన పిటీషన్ విచారణ పూర్తి అయ్యేవరకు ఆ పార్టీ బీఆర్ఎస్‌గా మారదని అన్నారు. దీనిపై ఢిల్లీ కోర్టుకు కూడా వెళుతున్నామన్న రేవంత్ రెడ్డి.. ఒకటి రెండు రోజుల్లో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ఇన్‌కం టాక్స్ నిర్మల సీతారామన్ పరిధిలోనిదని.. టీఆర్ఎస్ చెందాల విషయంపై ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ చిత్ర విచిత్ర పనులు, మాటలు ఆయనకు అలవాటేనని అన్నారు రేవంత్ రెడ్డి.

నేటి నుంచి 14 తేదీ వరకు ముఖ్య నేతలంతా మునుగోడు ప్రచారంలోనే ఉంటారని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారానికి వస్తారని.. ఆయనతో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. అక్టోబర్ 31న ఇంధిరా గాంధీ వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని అన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీలపై చేసిన వాఖ్యలు నిరాధారణమైనవి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరు లేరని అన్నారు. ఆ తరువాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్య నేతలంతా మునుగోడుపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎలాంటి అనుమానాలు వద్దు.. పార్టీ విజయం కోసం పనిచేస్తారని అన్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని ఎవరు డిమాండ్ చేసారో తనకు తెలియదని భట్టి చెప్పారు.

ALSO READ : మునుగోడు బైపోల్‌ వేళ.. టీ-కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి బిగ్ షాక్!

Advertisement

Next Story