ఈటలకు బీజేపీ ‘సీనియర్లు’ హ్యాండ్ ఇస్తున్నారా.?

by Anukaran |   ( Updated:2021-07-29 22:38:20.0  )
ఈటలకు బీజేపీ ‘సీనియర్లు’ హ్యాండ్ ఇస్తున్నారా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఒంటరి పోరు సాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలో చేరినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. పార్టీలో ‘ఏక్ నిరంజన్’గా మిగిలిపోయారు. అన్నీ తానై పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల మద్దతు పుష్కలంగా ఉందనే ధీమాతో ఉన్నా అది ఏ మేరకు ఓట్లుగా మారుతుందనేది ఈటల అనుచరుల్లోనే చర్చనీయాంశమైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ నేతలంతా కలిసి ప్రదర్శించిన సమిష్టి కృషి హుజూరాబాద్‌లో కనిపించడంలేదు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అమలు చేస్తున్న ఎత్తుగడలను, దూకుడును, సోషల్ మీడియా ప్రచారాన్ని తట్టుకోడానికి ఈటల ఎక్కువ సమయాన్నే వెచ్చించాల్సి వస్తున్నది.

ఆటలో అరటిపండు..

బీజేపీలో చేరినా సీనియర్ల నుంచి పెద్దగా ఆదరణ పొందలేకపోతున్నారు. పాదయాత్రలోగానీ, నియోజకవర్గంలోగానీ ఆ నేతలు పెద్దగా పాల్గొనడం లేదు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్‌రెడ్డి ఇప్పటివరకూ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల కారణాన్ని చూపి అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకు చెందిన మురళీధర్ రావు లాంటి నేతలు కూడా కనిపించడంలేదు.

సొంత పార్టీ నేతల నుంచే ఈ సహాయ నిరాకరణను ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి ఇటీవల పార్టీని వీడారు. టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. సొంత నియోజకవర్గంలోని బీజేపీ నేతల నుంచే ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న వర్గపోరుతో ఈటల పరిస్థితి ‘ఆటలో అరటిపండు’లా మారిందని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.

ఈటలకు బీజేపీ అవసరం ఏర్పడిందా లేక కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ఈటల అవసరమే బీజేపీకి ఏర్పడిందా? అనే చర్చ మొదలైంది. ఏ పార్టీలో చేరకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉండేదోగానీ బీజేపీలో చేరిన తర్వాత మాత్రం ఊహించుకున్నంత తీరులో ఆదరణ లభించడం లేదని ఆయనకు సన్నిహతంగా ఉన్నవారే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం ఆయనకు నియోజకవర్గంలో కుడి, ఎడమ భుజాలుగా ఉన్న చాలా మంది నమ్మకస్తులు ఆయన నుంచి దూరమవుతున్నారు. టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. కనీసం వారిని కాపాడుకోలేకపోతున్నారు.

బీజేపీలో చేరిక లాభమా? నష్టమా?

ఇప్పటికే బీజేపీలో చేరింది తన స్వంత ఆస్తుల రక్షణ కోసమే అనే ఆరోపణలు ప్రారంభంలోనే వెల్లువెత్తాయి. బీజేపీని ఒక పార్టీగా వాడుకోడానికి బదులు ఈటల తన స్వంత అస్తిత్వం కోసమే పాకులాడుతున్నారనే విమర్శలూ వచ్చాయి. దానికి బలం చేకూర్చేలా పార్టీ సీనియర్ నేతల నుంచి పెద్దగా సహకారం లభించడంలేదు. పార్టీలోనే ఈటలపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పార్టీలో చేరిన తర్వాత ‘జై శ్రీరామ్’,‘జై మోడీ’,‘జై బీజేపీ’ లాంటి నినాదాలు ఇవ్వడంలేదని పార్టీలోని ఒక వర్గం కామెంట్ చేస్తున్నది. ఆ నినాదాలు ఇస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని మరో వర్గం వ్యాఖ్యానిస్తున్నది. బీసీల ప్రతినిధిగా అప్పటివరకూ ఉన్న గుర్తింపు బీజేపీలో చేరికతో మరో రూపంలోకి మారిపోయింది. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న వర్గాలు తొలుత మద్దతుగా నిలిచినా బీజేపీలో చేరిన తర్వాత ఈటలను దూరం పెట్టాయి.

ఈటల గెలుపు కొద్ది మంది ఉనికికి చేటు !

ఈ నియోజకవర్గంలో ఈటల గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఓడించారన్న విస్తృత ప్రచారం లభిస్తుందని, అది పార్టీ కేంద్ర నాయకత్వం వరకూ వెళ్లి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని, చివరకు రాష్ట్ర నాయకత్వం కన్నా ఉన్నత అవకాశాలు, గుర్తింపు లభిస్తుందని, అందువల్లనే చాలా మంది సీనియర్లు అంటీ ముట్టనట్లుగా ఉన్నారనే చర్చ కూడా ఉన్నది. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే రాబోయే ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని, అందువల్లనే ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తాము ముఖ్యమంత్రి అభ్యర్థులమని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లాంటివారు బలంగా భావిస్తున్నారని, ఇప్పుడు ఈటల గెలుపు పార్టీలో కొత్త తలనొప్పి తెచ్చే ఆస్కారం ఉంటుందని ఆ పార్టీకి చెందిన ఒకరు వ్యాఖ్యానించారు.

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలిచిన ప్రభావంతో ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న హుజూరాబాద్‌లో బీజేపీ శ్రేణులు ఒక్కటై గెలిపించుకోడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆ తీరులో ఉత్సాహం కనిపించడంలేదని ఉదహరించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో రఘునందన్‌రావును గెలిపించుకోడానికి పార్టీలోని వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం అదే సమిష్టి కృషి కనిపించింది. కానీ హుజూరాబాద్ ఎన్నిక విషయంలో మాత్రం సీనియర్ నేతలంతా ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు.

నియోజకవర్గ ఇన్​చార్జిగా ఉన్న జితేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ లాంటి కొద్దిమందే తప్ప ఇతరులు పెద్దగా యాక్టివ్‌గా లేరు. అధికార పార్టీలో ఉండి ఇంతకాలం పింఛన్లు, రేషను కార్డులను కూడా ఇప్పించలేని ఈటల రాజేందర్ భవిష్యత్తులో బీజేపీ అభ్యర్థిగా గెలిచినా ప్రతిపక్షంలో ఉండాల్సిందేనని, అధికార పార్టీతో నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల నిధులు, సంక్షేమాన్ని ఎలా తీసుకురాగలుగుతారనే చర్చలు హుజూరాబాద్‌లో ఇప్పటికే మొదలయ్యాయి. ఇన్ని ఒడిదుడుకులను తట్టుకుని ఎదురీదడం ఈటలకు కత్తిమీద సాములా మారింది.

Advertisement

Next Story