ఈటల నియోజకవర్గంలో పోరు.. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కండువా

by Sridhar Babu |   ( Updated:2021-06-28 02:30:08.0  )
ఈటల నియోజకవర్గంలో పోరు.. అంబేద్కర్  విగ్రహానికి బీజేపీ కండువా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు వింత పోకడలో సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీని మట్టి కరిపించాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు వేస్తున్న అడుగులపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ లేఖపై ఈటల కూడా ఫైర్ అయ్యారు. తప్పుడు లేఖలు సృష్టిస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా చేశారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ సోషల్ మీడియా కూడా పోస్టింగ్‌ల పరంపర కొనసాగించింది.

అంబేడ్కర్‌నూ వదలడం లేదు

తాజాగా భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం చుట్టూ రాజకీయాలు అల్లుకుంటున్నాయి. హుజురాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి కాషాయ కండువా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన కాషాయ కండువా చుట్టే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు హుటాహుటిన వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత, ప్రజా సంఘాల నాయకులు కూడా క్షీరాభిషేకం చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదంతా బీజేపీ నాయకులు చేసిన పనే అంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడ అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ది చేసేందుకు రానున్నారు. ఉప ఎన్నికల కారణంగానే అంబేడ్కర్ విగ్రహం చుట్టూ రాజకీయాలు మొదలు పెట్టారని అంటున్నారు స్థానికులు.

సీసీ కెమెరాల్లో చూస్తే…

హుజురాబాద్ పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నందున ఫుటేజ్ ఆధారంగా ఆరా తీస్తే సరిపోతుందున్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫుటేజ్ లో అంబేడ్కర్ విగ్రహంపై కాషాయ కండువా కప్పిందెవరో రికార్డు అయ్యే అవకాశం ఉంది. దీంతో దానిని ఆధారం చేసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతుందన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story