కరీంనగర్‌లో బీజేపీకి షాక్.. టీఆర్‌ఎస్‌లోకి కార్పొరేటర్

by Sridhar Babu |

దిశ, కరీంనగర్ :
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇలాఖాలో కమలం పార్టీకి గట్టి షాక్ తగలింది.36వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిల్ల జయశ్రీ రాష్ట్ర స్థానిక మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..ఎంపీ బండి సంజయ్ మాట్లాడే తీరు బాలేదని, ప్రతి ఒక్కరూ ఆయన్ను తప్పుపడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏక వచనంతో సంభోదించడం సంజయ్‌కే చెల్లిందన్నారు. డివిజన్ ప్రజలు జయశ్రీపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఆమె కారెక్కారని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.

సంజయ్ పార్టీని అగాథంలోకి తీసుకెళ్తారు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీని అగాథంలోకి తీసుకెళ్తున్నారని కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ అన్నారు. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఆమె మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో కూడా ఆయన కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. జిల్లాను అభివృద్ధి చేసే సత్తా మంత్రి గంగులకు మాత్రమే ఉందని డివిజన్ ప్రజలు తెలిపారన్నారు. అలాగే కష్టకాలంలో ప్రజలకే కాదు, కార్యకర్తలకు కూడా బాసటగా నిలిచిన గంగుల కమలాకర్ తీరు కూడా తనకు నచ్చిందని జయశ్రీ ప్రకటించారు.

Advertisement

Next Story