బ్యాక్ టు సైకిల్

by Anukaran |
బ్యాక్ టు సైకిల్
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యాయామం చేయడానికి జిమ్ వరకు కారులో వెళ్తారు. కానీ, జిమ్‌లో అడుగుపెట్టాక సైకిల్ తొక్కుతారు. అదేదో జిమ్ వరకు సైకిల్ మీద వెళితే, జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా? ఫిజికల్ ఫిట్‌నెస్ మీద నిజమైన ప్రేమ ఉన్నవారందరూ సొంతంగా సైకిల్ కొనుక్కుని రోడ్ల మీద తిరగడానికే ప్రాధాన్యతనిస్తారు. అలాగే సైకిల్ అనేది ఒకప్పుడు మధ్యతరగతి వ్యక్తికి కారు లాంటిది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ సైకిల్‌ను ఉపయోగిస్తున్నవాళ్లు ఉన్నారు. అయితే గత ఐదేళ్లుగా సైకిల్ తయారీ, అమ్మకాల రంగం చాలా నష్టాల్లో నడుస్తోంది. కొనేవాళ్లు ఏకంగా బైక్‌లు, స్కూటీలు కొనడానికి ఇష్టపడుతుండటం, ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న వ్యక్తులు దిగుమతి చేసుకున్న సైకిల్‌లు కొంటుండటంతో దేశీయ సైకిల్ పరిశ్రమలు మూతపడే స్థాయికి వచ్చాయి. కానీ, కరోనా కారణంగా వారి పరిస్థితి మారింది. అన్ని రంగాలు నష్టాల పాలైతే సైకిల్ రంగం మాత్రం ఇప్పుడు వేగం పుంజుకుంటోంది. ఎలాగంటారా?

పాండమిక్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఎక్కువగా వాడకపోవడంతో ఇప్పటికే ఉన్న బైకులు, కార్లు, ఇతర మోటార్ వాహనాలు రిపేరు చేయించాల్సిన స్థాయికి చేరుకున్నాయి. ఎలాగూ నిబంధనల మధ్య బయటికి వెళ్లాల్సి వస్తోంది. అలాగే ఎప్పుడు ఏ నిబంధనలు విధిస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి వాటిని ఎవరూ రిపేరు చేయించడానికి ఆసక్తి చూపించడం లేదు. పైగా రిపేరు షాపులు కూడా పెద్దగా తెరుచుకోవడం లేదు, అంతేగాకుండా రిపేరుకు కూడా ఖర్చు భారీగా అవుతోంది. బయటికి వెళ్లినప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను నమ్మే పరిస్థితిలో లేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించి, వీటన్నింటికీ ఒకటే పరిష్కారం సైకిల్ అని జనాలు రియలైజ్ అయ్యారు. అందుకే ఉన్నంతలో మంచి సైకిల్ కొనడానికి ఎగబడుతున్నారు. దీంతో ఈ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేక ఇప్పుడు సైకిల్ తయారీ రంగం రోజుకు 24 గంటలు కష్టపడుతోంది.

వైరస్ కారణంగా అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడం..సైకిళ్ల కొనుగోళ్లకు ఊతం వేసిందని పీపుల్ ఫర్ బైక్స్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. వీరు నిర్వహించిన సర్వేలో లాక్‌డౌన్ అమలైన నాటి నుంచి వివిధ దేశాల్లో సైకిల్‌ల అమ్మకాలు పెరిగినట్లు తేలిందని వెల్లడించారు. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు మోటార్ లేని వాహనాల కొనుగోళ్లకు ఆఫర్‌లు కూడా ప్రకటించడంతో ఆయా దేశాల్లో విరివిగా సైకిల్స్ అమ్ముడుపోయినట్లు చెప్పారు. ఫ్రాన్స్‌లో సైకిల్‌లు వాడేవారి సంఖ్య పెరగడంతో వాటికి తగ్గట్టుగా రోడ్లను కూడా మార్చారని పీపుల్ ఫర్ బైక్స్ ప్రతినిధి ఆండ్రూ పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా లేక కొవిడ్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్లీ సైకిళ్ల వాడకాన్ని తగ్గిస్తారా? అనే అంశం గురించి ప్రస్తుతం వారు సర్వే చేస్తున్నట్లు ఆండ్రూ వెల్లడించారు. బైసైకిల్‌లు వాడటం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవడం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ఒకింత సాయం చేస్తూ సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు అవకాశం దొరుకుతోందని ఆండ్రూ వివరించారు. సామాజిక స్పృహ సంగతి అటుంచితే ఇప్పుడు గుంపులుగా ప్రయాణించడం ఇష్టపడని వాళ్లందరూ సైకిల్‌లు కొనుగోలు చేస్తుండటం ఒకందుకు మంచిదేననిపిస్తోంది.

ప్రస్తుతానికి ఈ సైకిల్ వాడటమనే పాత పద్ధతి ఒక విప్లవం లాగే మారే అవకాశం కనిపిస్తోంది. సైకిళ్లు వాడటం వల్ల సామాజిక దూరం పాటిస్తూ ఆఫీసులకు వెళ్లే సదుపాయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న కష్టసమయాల్లో జిమ్‌లకు ఫీజులు కట్టే స్థితి నుంచి బయటపడొచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్న వెయ్యి రెట్లు సురక్షితం. దీంతో సైకిల్ బూమ్ వచ్చేసిందని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు. ఈ బూమ్‌ వల్ల సైకిల్ మీద వెళ్లి కావాల్సినవి కొని తెచ్చుకునేంత దూరంలో కొత్త దుకాణాలు, నిత్యావసర వస్తువుల షాపులు కూడా పడి ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక కేంద్రీకృత విధానంగా, అంటే ఇంట్లో నుంచి ఎక్కువ దూరం బయటికి వెళ్లకుండా ఒక దగ్గర గుమిగూడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా కరోనా పాండమిక్ కారణంగా మానవ జీవన శైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

Advertisement

Next Story