రష్యా నుంచి కొత్త ఆయుధాల కొనుగోలు : కేంద్రం

by Shamantha N |   ( Updated:2020-07-02 08:08:17.0  )
రష్యా నుంచి కొత్త ఆయుధాల కొనుగోలు : కేంద్రం
X

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, 59 మిగ్ యుద్ధ విమానాలను ఉన్నతీకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఈ నెల 27వరకు భారత్‌కు చేరనున్న సంగతి తెలిసిందే. తాజాగా, 21 మిగ్-29 ఎయిర్‌క్రాఫ్టులను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అలాగే, 12 సుఖోయ్-30ఎంకేఐ విమానాలను హిందూస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేయడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఓసీ) సమ్మతం తెలిపింది. వీటితోపాటు క్షిపణుల కొనుగోలును ఆమోదించినట్టు తెలిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డీఓసీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం రూ. 38,900 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

రష్యా నుంచి మిగ్-29 కొనుగోలు, ఉన్నతీకరణ కోసం రూ. 7,418 కోట్లు, హెచ్ఏఎల్ నుంచి 12 సుఖోయ్ విమానాల కొనుగోలుకు రూ. 10,730 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర రక్షణ శాఖ ఈ సమావేశానంతర ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా వైమానిక రంగానికి కావల్సిన ఆయుధాలు, క్షిపణులను సమకూర్చుకోవాల్సిన అవసరమున్నదని, ప్రధాని పిలుపిచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’‌కు అనుగుణంగానే ఈ ప్రతిపాదనల అమలు ఉంటుందని వివరించింది. తయారీరంగంలో ఎంఎస్ఎంఈలను చేర్చి స్వావలంబన భారత్‌గా ఎదగేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో కొన్నింటిలో దాదాపు 80శాతం కంటెంట్ కేవలం స్థానికంగా తయారైనవే ఉంటాయని పేర్కొంది. అలాగే, ఈ మొత్తాన్ని సమకూర్చిన విధానాన్నీ వివరించింది. డీఆర్‌డీవో సాంకేతికతను దేశీయ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేసి పెద్దమొత్తంలోని కూడబెట్టినట్టు తెలిపింది. దాదాపు రూ. 31,130 కోట్లు భారత మార్కెట్ల ద్వారానే రాబట్టడాన్ని వివరించింది.

Advertisement

Next Story