వీడియో కాలింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

by Shyam |
వీడియో కాలింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
X

ప్రియ ఆఫీసు నుంచి 7 గంటలకు ఇంటికి చేరుకుంది. వచ్చి రాగానే.. తన ప్రేమికుడు రఘుతో మాట్లాడుతూనే ఉంది. అప్పటికే టైమ్ పది అయ్యింది. ఫోన్ కట్ చేసి.. అరగంట కాలేదు.. అప్పుడే ట్రింగ్ మంటూ ఓ మెసేజ్ వచ్చింది. ప్రియ నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది.. వెంటనే వీడియో కాల్ చేయవా ప్లీజ్ అంటూ బ్రతిమిలాడాడు. దీంతో ప్రియ వీడియోకాల్ చేసింది. ఇద్దరూ మళ్లీ మాటల్లో పడిపోయారు. నిన్ను చూడాలని చెప్పింది… ఇలా కాదంటూ ప్రియతో రఘు అన్నాడు. మరి ఎలా అంటూ సిగ్గు పడిపోయింది ప్రియ. దొంగ పిల్ల… నీకు తెలియదా? అని రఘు అనడంతో.. ఛీ పో… నీకు సిగ్గు లేదు.. అంటూ ప్రియ చిరుకోపం ప్రదర్శించింది. అయ్యో… ఈ మాత్రం దానికే సిగ్గు పడిపోవాలా అని రఘు ప్రశ్న. నువ్వు ఇలా చేస్తే కాల్ కట్ చేస్తానని ప్రియ చెప్పింది. నేను చెప్పింది నువ్వు చేయకపోతే.. నేనే నీతో మాట్లాడనని రఘు అన్నాడు. ప్రియ.. నువ్వు ఎప్పుడూ ఇంతే బై బై అంటూ కాల్ కట్ చేసింది. కాసేప్లటోనే.. మనసు మార్చుకున్న ప్రియ.. రఘుకు కాల్ చేసింది. సరే కానీ.. నాకు చాలా సిగ్గుగా ఉందని, నువ్వు కళ్లు మూసుకోవాలని రఘుతో చెప్పింది. ఓకే అంటూ రఘు కళ్లు మూసుకున్నాడు. కట్ చేస్తే… రెండు రోజుల తర్వాత.. నాకు 5 లక్షలు కావాలి. ఇవ్వకపోతే.. నీ న్యూడ్ ఫోటోలు, వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తానని రఘు నుంచి ప్రియకు ఓ మెసేజ్. ప్రియకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసుల దగ్గరకు వెళితే.. ఎక్కడ అందరికీ తెలిసిపోతుందననే భయం. అమ్మనాన్నలకు తెలిస్తే వాళ్ల పరువు ఏం కావాలన్న ఆందోళన. 5 లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు ఎవరు ఇస్తారనే ఆలోచన.

బాధితురాలు.. ఆమె కాదు.. మనమందరం:

ఇది ప్రియకు మాత్రమే జరిగింది కాదు. ప్రస్తుతం ఎంతోమంది యువతులు ఇలా ప్రేమ పేరుతో.. మోసగాళ్లకు చిక్కుతున్నారు. వారి ట్రాప్‌లో పడి డబ్బులు, పరువు పోగొట్టుకోవడమే కాకుండా.. తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎంత తెలిసిన వ్యక్తులైన, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులైనా.. అమ్మాయిలు తమ జాగ్రత్తల్లో తాము ఉండాలి. వారికి తమ న్యూడ్ ఫోటోస్ పంపించడం కానీ, వీడియో కాల్ మాట్లాడటం కానీ చేయకూడదు. వీడియో కాల్‌ను రికార్డు చేసే ఎన్నో యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనం మాట్లాడిన వీడియో కాల్స్ , ఆడియో కాల్స్‌ను కూడా ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించి… లొంగదీసుకునే వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. పరువు కోసమో, పది మందికి తెలియకూడదనో వాళ్లు చెప్పినట్లు చేస్తుంటారు చాలామంది. అంతేకాదు, మనం పెట్టుకునే వాట్సాప్ డీపీ, ప్రొపైల్ ఫొటో, స్టేటస్‌లు, ఇలా ఏదైనా సరే.. ఒక్కసారి ఆన్లైన్ గోడ మీదకు చేరిందా.. ఇక అంతే.. మన ఫొటోలను మార్ఫింగ్ చేసి.. డబ్బులు అడగడం లేదా ఇంటర్నెట్లో పోస్ట్ చేయడమో చేస్తుంటారు. అందుకే అసలు సోషల్ మీడియాలో మనకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ పెట్టకపోవడం ఎంతో ఉత్తమం. సోషల్ మీడియా సైట్లు ఎంత ప్రైవసీ కల్పించినా.. మనకు మనం అవగాహన పెంచుకుని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. మన ఆనందాన్ని మన ఇంటి సభ్యులతో పంచుకోవాలి. అంతే కానీ.. పది మందికోసమో.. సమాజం కోసమో, బిల్డప్ కోసమో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తగదు. ఊరెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా. గుడికి వెళ్లినా, సినిమా థియేటర్ కు వెళ్లినా.. ఫొటోనో, సెల్ఫీనో దిగాలని, వెంటనే ఆన్ ది స్పాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, ఇలా చేయడం వల్ల మనకు ఏం రాకపోగా, మోసగాళ్లకు, సైబర్ నేరగాళ్లకు మన ప్రతి కదలికను చేరవేస్తున్నామనే విషయాన్నిగ్రహించలేకపోతున్నాం. ఇకనైనా జాగ్రత్తగా ఉండి.. ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం మానుకుందాం. ఎవరి నుంచి బెదిరింపులు ఎదురైనా.. వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించాలి. ఏం జరిగినా.. ఆ విషయాన్ని ముందుగా మన ఇంటి సభ్యులకు తెలియజేసి, వారి సహాయం తీసుకోవాలి. అంతే గానీ ఒంటరిగా బాధపడి, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు.

వీడియో చాట్ ఉపయోగాలు:

బొమ్మ బొరుసు, చీకటి వెలుగుల్లా.. వీడియో చాటింగ్‌తో నష్టాలే కాకుండా ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనుషుల్ని, బంధాల్ని, కుటుంబాల్ని దగ్గర చేసింది. మనుషల మధ్య దూరాన్ని చెరిపేసి అందరినీ చేరువ చేసింది. దూరంగా ఉన్నబంధువులను చూసుకోవాలన్నా అమెరికాలో ఉన్న కొడుకును పలకరించాలన్నా, నాలుగు కిలోమీటర్ల ఆవల ఉన్న ఫ్రెండ్ తో కబుర్లు చెప్పాలన్నా, ఇష్టసఖిని విడిచి ఉండలేని ప్రేమికుడి విరహ వేదనకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్నా, అన్నింటికీ ఒకే సొల్యుషన్.. అదే వీడియో చాట్… లేదా వీడియో కాల్. వర్క్ ప్లేస్‌లో కూడా దీని ఉపయోగం ఎక్కువే. వీడియో కాలింగ్.. మెడికల్ సెక్టార్‌లో పెనుమార్పును తీసుకు వచ్చింది. ఎక్కడో మారుమూల ఉన్న పేషేంట్స్ ను ట్రీట్ చేయడానికి డాక్టర్లు వీడియోకాల్‌ను సాధనంగా వాడుతున్నారు.

గుడ్ అండ్ బ్యాడ్:

వెలుగులు పంచే సూర్యుడే.. మనకు చీకటిని కూడా పరిచయం చేస్తాడు. ప్రేమ పంచే అమ్మనాన్నలే.. పిల్లల్ని భయంలో పెట్టుకుంటారు. అలానే సోషల్ మీడియా వల్ల లెక్కకు మించి ఉపయోగాలు ఉన్నా దాన్ని ఉపయోగించుకునే తీరులోనే.. అసలైన అర్థం దాగుంది. ఎంత సోషల్ అయినా మన ప్రైవసీ మనకు ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

వీడియో కాలింగ్ యాప్స్ :

స్కైప్, గూగూల్, వాట్సాప్, ఫేస్ టైమ్, ఐ ఎమ్ వో ఇలా ఎన్నో యాప్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి.

tags : video call, video chatting, whatsapp, instagram, skype, nude, social media,

Advertisement

Next Story

Most Viewed