ఐపీఎల్ రద్దుతో బీసీసీఐకి రూ. 2000 కోట్ల నష్టం?

by Shyam |
IPL-2021
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా దెబ్బకు లీగ్‌ను రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీగ్‌ అర్దాంతరంగా ఆగిపోవడంతో బీసీసీఐకి రూ. 2వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. లీగ్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐపీఎల్ వాయిదా పడటంతో బ్రాడ్‌కాస్టర్ ఫీజు, స్పాన్సర్‌షిప్ ఆదాయం మొత్తం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

‘ఐపీఎల్ వాయిదా కారణంగా రూ. 2000 కోట్ల నుంచి రూ. 2500 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాము. స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ ఆ మేరకు చెల్లింపులు జరిపే అవకాశం లేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. డిస్నీ స్టార్ ఇండియా ప్రతీ సీజన్‌కు రూ. 3269 కోట్లు బీసీసీఐకు చెల్లిస్తున్నది. దీంతో పాటు వీవో రూ. 440 కోట్లు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించినందుకు చెల్లింపులు జరుపుతున్నది. ఇప్పుడు కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరగడంతో ఆ మేరకు మాత్రమే బీసీసీఐకి చెల్లించే అవకాశం ఉన్నది. అదే జరిగితే సగానికంటే ఎక్కువ ఆదాయం బీసీసీఐ కోల్పోతున్నది. వీరితో పాటు అసోసియేట్ స్పాన్సర్లు, టోర్నీ పార్ట్‌నర్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గనున్నది.

Advertisement

Next Story