ఈటలపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు.. ఏం చేస్తావో చెప్పు అంటూ..

by Anukaran |   ( Updated:2021-10-01 12:05:06.0  )
ఈటలపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు.. ఏం చేస్తావో చెప్పు అంటూ..
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : మంత్రిగా నియోజక వర్గంలో అభివృద్ధి చేయని ఈటల.. ఎమ్మెల్యేగా గెలుపొందితే ఏం చేస్తాడో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. శుక్రవారం కమలాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సిటి సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడారు. 2001 నుండి 2021 వరకు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారని, ఇక్కడి ప్రజలు తిరిగి ఉప ఎన్నికల్లో కేసీఆర్ నిలబెట్టిన వారిని గెలిపిస్తారన్నారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఈటల తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆత్మగౌరవం పేరిట అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

తానూ పార్టీ మారి బీజేపీలో చేరితే ఆత్మగౌరవం అని చెప్పే ఈటల ఇతరులు టీఆర్ఎస్‌లో చేరితే బానిసలనడం ఎంతవరకు సమంజసం అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తే తోడేళ్ల అంటూ పేర్కొనడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షులు ఇతర ప్రాంతాల నాయకులు వచ్చి బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు. రాజేందర్ తన గెలుపు కోసం స్థాయి తగ్గించుకొని అసత్యాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. అభివృద్ధిని అడ్డుకునే బీజేపీ కావాలా.. అభివృద్ధి చేసే టీఆర్ఎస్ కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సానుభూతి కోసం బీజేపీ నాయకుల మాదిరిగా ఈటల రాజేందర్ కూడా తనపై తానే దాడి చేయించుకొని కొత్త నాటకానికి తెర లేపేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు ఈ సమావేశంలో కమలాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు బాలసాని కుమారస్వామి గౌడ్, నవీన్ కుమార్, నాయకులు పింగిళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story