రాజేందర్‌ను ఢీ కొట్టింది నా కారు కాదు.. బండి సంజయ్‌ మిత్రుడిది: బాల్క సుమన్

by Anukaran |   ( Updated:2021-10-12 05:29:36.0  )
రాజేందర్‌ను ఢీ కొట్టింది నా కారు కాదు.. బండి సంజయ్‌ మిత్రుడిది: బాల్క సుమన్
X

దిశ, హుజూరాబాద్: శవ రాజకీయాలు చేస్తూ సానుభూతితో ఓట్లు పొందాలని ఈటల పన్నుతున్న కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం కమలాపూర్ మండలం దేశరాజపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నాగుర్ల రాజేందర్ ఉప్పల్-భీంపల్లి క్రాస్ రోడ్ వద్ద కార్ ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందగా.. ఆ కారు బాల్క సుమన్‌దేనని ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నానా యాగీ చేసి రాస్తారోకో నిర్వహించారని ఆరోపించారు. రాజేందర్ ఆటోను ఢీకొట్టిన కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మిత్రుడిదని మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సుమన్ ఆరోపించారు.

ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఉప్పల్ రోడ్డుపై బైఠాయించిన ఈటల, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందాలనే.. టీఆర్ఎస్ నేతలపై బురద జల్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం ఈటల దంపతులు వారిపై వారే దాడి చేయించుకునే స్థాయికి దిగజారే అవకాశాలున్నాయన్నారు. ఓటమి భయంతో మత చిచ్చు రగిల్చేందుకు బీజేపీ వెనుకాడదన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సుమన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed