బజాజ్ ఆటో అమ్మకాలు 33 శాతం డౌన్

by Shyam |
బజాజ్ ఆటో అమ్మకాలు 33 శాతం డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో ప్రస్తుత ఏడాది జులైలో 33 శాతం క్షీణతతో 2,55,832 యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్టు సోమవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 3,81,530 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అమ్మకాలు తగ్గినప్పటికీ టూ-వీలర్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.

దేశీయ రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారైన బజాజ్ ఆటో జూన్ నెలలో 2,78,097 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ‘దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అధికంగా ఉందని, బలమైన పునరుజ్జీవన సాధిస్తున్నామని, అయితే..త్రీ-వీలర్ విభాగంలో ఇంకా పుంజుకోలేదని బజాజ్ ఆటో సీఈఫ్‌వో సోమన్ రే తెలిపారు. ఇక, దేశీయ అమ్మకాలు 23 శాతం నష్టాలను చవిచూశాయి. ఇవి గత నెలలో 1,58,976 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. గతేడాది జులైలో దేశీయ విక్రయాలు 2,05,470 యూనిట్లుగా నమోదయ్యాయి.

అలాగే, జులైలో కంపెనీ ఎగుమతులు 96,856 యూనిట్లు ఉండగా, గతేడాది జులైలో ఎగుమతులు 1,76,050 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాల దేశీయ అమ్మకాలు గరిష్ఠంగా 81 శాతానికి పడిపోయాయి. ఈ విభాగంలో ఎగుమతులు 57 శాతంగా ఉన్నాయి. కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జులైలో 1,52,474 యూనిట్లు ఉండగా, గతేడాది ఇదే కాలంలో 1,70,978 యూనిట్లతో పోలిస్తే 11 శాతం అమ్మకాలు తగ్గాయి.

జూన్‌లో సైతం ఈ విభాగంలో 27 శాతం అమ్మకాల క్షీణత నమోదైంది. రానున్న కాలంలో టూ-వీలర్ విభాగంలో అత్యధిక విక్రయాలు నమోదవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమ నెమ్మదిగా కోలుకునే క్రమంలో జూన్‌లో కంపెనీ ఆటో అమ్మకాల్లో 31 శాతం క్షీణత నమోదైనట్టు పేర్కొంది. కాగా, గత వారం ఆర్థిక ఫలితాల్లో బజాజ్ ఆటో త్రైమాసిక లాభం 53 శాతం క్షీణించి రూ. 528 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ. 3,079.24 కోట్లుగా వెల్లడించింది.

Advertisement

Next Story