అమిత్ మిశ్రా ఇంటిపై దాడి.. అడ్డొచ్చిన గర్భిణీపై విచక్షణ రహితంగా..!

by Anukaran |   ( Updated:2021-12-28 05:16:24.0  )
అమిత్ మిశ్రా ఇంటిపై దాడి.. అడ్డొచ్చిన గర్భిణీపై విచక్షణ రహితంగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: డొమెస్టిక్ క్రికెటర్ ఇంటిపై దాడి వ్యవహారం ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం రేపింది. బిలాస్‌పూర్‌ జిల్లా సర్కండలోని కృష్ణ విహార్ కాలనీలో నివాసం ఉంటున్న రంజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ఇంటిపై స్థానికంగా ఉన్న పలువురు దాడి చేశారు. కర్రలు, రాడ్లు తీసుకువచ్చి తలలు పగులగొట్టారు. ఓ గోడకు పెయింటింగ్ వేసే వ్యవహారంలో అమిత్ మిశ్రా తండ్రి, స్థానికంగా ఉండే గంగాధర్ మిశ్రాకు వాగ్వాదం జరిగింది.

దీంతో వెంటనే తన సోదరులు, పలువురిని వెంట తీసుకొచ్చిన గంగాధర్ అమిత్ మిశ్రా తండ్రి, కుటుంబంపై దాడి చేశారు. గొడవను ఆపేందుకు మధ్యలో వచ్చిన అమిత్ భార్య తలపై రాడ్డు తీసుకుని బలంగా కొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ఏకంగా 10 కుట్లు పడ్డట్టు బాధితురాలు చెప్పుకొచ్చింది. పైగా గర్భిణీ స్త్రీ అని చూడకుండా దాడి చేయడం దారుణం. ప్రస్తుతం బాధితులు స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడి సమయంలో అమిత్ మిశ్రా అహ్మదాబాద్‌లోని రంజీ క్యాంపులో ఉన్నాడు. దాడిపై వెంటనే అమిత్ భార్య తనకు ఫోన్ ద్వారా తెలియజేసింది. వెంటనే క్యాంపు మధ్యలో నుంచి బయల్దేరినట్టు తెలుస్తోంది. ఇంటి మీదకు వచ్చి వాగ్వాదం చేయడమే కాకుండా.. కర్రలు, రాడ్లు తీసుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని పోలీసులకు అమిత్ మిశ్రా కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ 307 కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారన్నారు.

ఎవరీ అమిత్ మిశ్రా..

అమిత్ మిశ్రా రైల్వేస్ జట్టు తరఫున రంజీ ఆడుతున్నాడు. అతడు విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలలో కూడా ఆడాడు. సెంట్రల్ జోన్ టీ20 కూడా ఆడాడు. అమిత్ తన క్రికెట్ కెరీర్‌ను 2008 నుండి ప్రారంభించాడు. అతను ఎంపీ జట్టులో కూడా ఆడాడు.

Advertisement

Next Story