నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

by Shyam |   ( Updated:2021-09-23 23:04:25.0  )
Telangana Assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని పార్టీల ప్రతినిధులతో జరిగే బీఏసీ సమావేశంలో ఈ సెషన్‌ను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి..? ఏయే అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలి..? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. నిర్దిష్ట టైమ్ టేబుల్‌ ఖరారు కానుంది. ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం. ఈ ఏడాది మార్చి 26వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు ఆర్డినెన్సులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు వాటి స్థానంలో బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనికి తోడు కొన్ని కొత్త బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నది.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆగస్టు 13న ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు, జూన్ 25న హౌజింగ్ బోర్డు చట్టానికి సంబంధించి చేయాల్సిన సవరణలపై మరో ఆర్డెనెన్సును ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు ఈ వీటి స్థానంలో నిర్దిష్టంగా బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించిన బిల్లు, విదేశీ టూరిస్టులపై దాడులు జరిగితే తీసుకోవాల్సిన చర్యల కోసం మరో బిల్లు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దళితబంధుకు చట్టబద్ధత కల్పించడానికి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తరహాలో ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెషన్‌లో మొత్తం ఎనిమిది బిల్లులు సభ ముందుకు రావచ్చని సమాచారం.

తొలి రోజు ముగియగానే ఢిల్లీకి సీఎం

గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. గతంలో లాగానే కరోనా కారణాన్ని చూపి మీడియాపై ఆంక్షలు యధావిధిగానే కొనసాగుతున్నాయి. సమావేశాల నిర్వహణపై మొదటి రోజున జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి వివిధ పార్టీల నేతలతో పాటు ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. సెషన్‌ను ఎన్ని రోజుల పాటు జరపాలనే దానిపై చర్చించనున్నారు. ఆ సమావేశం ముగియగానే నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కేసీఆర్ వెళ్ళనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే పర్యటించి తిరిగి సోమవారం ఉదయం అసెంబ్లీ సెషన్‌కు హాజరుకానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed