ఆ నిర్ణయం సింగరేణికి వర్తించదా?

by Sridhar Babu |
ఆ నిర్ణయం సింగరేణికి వర్తించదా?
X

దిశ, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సింగరేణిలోని ఆ విభాగాల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా కుంగిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలవాలని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణిలో కూడా కోత విధించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు సింగరేణికి వర్తించవన్న వాదనలు ఓ వైపున వినిపిస్తుంటే, సింగరేణిలోని అన్ని విభాగాలకు చెందిన వారి వేతనాల్లో కోత విధిస్తుండడం మరో విమర్శకు దారి తీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారుల వేతనాల్లో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని వైద్య, ఆరోగ్య, పోలీసు విభాగాలకు పూర్తి స్థాయి వేతనం ఇస్తామని సీఎం ప్రకటించారు. కానీ, సింగరేణి విభాగంలోని అత్యవసర విభాగాల యంత్రాంగం వేతనాల్లో కోత విధించడం గమనార్హం.

దీంతో సింగరేణిలోని అన్ని విభాగాల్లోనూ నిరసన వ్యక్తమవుతోంది. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏరియా ఆసుపత్రుల్లో 1,600 మంది వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. 900 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వైద్య విభాగానికి చెందిన వారి నుండి రూ.5 కోట్ల 50 లక్షలు, సెక్యూరిటీ విభాగం నుండి రూ. 2 కోట్ల 50 లక్షల మేర వేతనాల్లో కోత విధించింది యాజమాన్యం. అయితే, సింగరేణి సంస్థ ఉద్యోగులకు అన్ని వేళల్లో సేవలందిస్తున్న మెడికల్ విభాగం విషయంలో కానీ, సంస్థను కంటికి రెప్పాలా కాపాడే సెక్యూరిటీ విషయంలో కానీ యాజమాన్యం మినహాయింపు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. వీరు అత్యవసర సేవలందించే విభాగాల పరిధిలోకి రారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, మణుగురు, ఇల్లందు, జయశంకర్ జిల్లా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ జిల్లా గోలేటి, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి సంస్థ 29 భూగర్భ గనులు, 19 ఓపెన్ కాస్టు బావుల ద్వారా బొగ్గు సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం కొత్తగూడెం కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన యాజమాన్యం, భూపాలపల్లి, గోదావరిఖని, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ కాలనీల్లో ఏరియా ఆసుపత్రులను, 8 ఇంక్లైన్ కాలనీలో రీజినల్ హస్పిటల్, ఇతర ప్రాంతాల్లో డిస్పెన్సరీలను కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. ఈ హాస్పిటల్స్ ద్వారా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు వైద్య సేదలందిస్తోంది వైద్య విభాగం యంత్రాంగం.

సింగరేణి పరిధిలోని 48 మైన్స్, కార్పొరేట్ ఆఫీసు, జీఎం, హస్పిటల్స్‌తోపాటు ఇతరత్రా ఆస్తుల వద్ద 900 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు 24 గంటలపాటు సంస్థను రక్షించేందుకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సెక్యూరిటీ వింగ్ మాత్రం నిరంతరం విధుల్లో ఉండాల్సిందే. అటు సంస్థ ఆస్తులను ఇటు బావులను కంటికి రెప్పలా కాపాడుతున్న తాము అత్యవసర విభాగం పరిధిలోకి రాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సెక్యూరిటీ విభాగం ఉద్యోగులు. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేందుకే కొంతమంది సింగరేణి సంస్థకు చెందిన అధికారులు తమ పొట్ట కొడుతున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. 24 గంటలు సర్వీస్ అందిస్తూ ఎమర్జెన్సీ వింగ్ లో పనిచేస్తున్న తమకు అన్యాయం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం అత్యవసర విభాగాల విషయంలో పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు.

ఆ విభాగాలకు అన్యాయం..

‘సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడిపిస్తున్న మెడికల్, సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ల యంత్రాంగానికి కూడా జీతాల్లో కోత విధించడం అన్యాయం. సింగరేణి సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వ జీఓలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. కనీసం ఎమర్జెన్సీ సర్వీస్ వింగ్‌లకయినా వేతనాల కోతలో మినహాయింపు ఇవ్వకపోవడం యాజమాన్యం నిరంకుశత్వానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అత్యవసర విభాగాలకో న్యాయం, సింగరేణి ఎమర్జెన్సీ విభాగాలకో న్యాయం అన్నట్టుగా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా యాజమాన్యం అత్యవసర విభాగాల వారికి పూర్తి వేతనం అందించాల్సిందే. కరోనా వ్యాధి వ్యాపించిన ఈ సమయంలో కూడా నిరంతరం సేవలందిస్తున్న ఈ రెండు విభాగాలకు కూడా ప్రోత్సాహకాలు అందించాలి’ అని గోదావరిఖనికి చెందిన రామ్మూర్తి కోరుతున్నాడు.

Tags: Godavarikhani, Singareni employees, Salaries, Deduction, Security, Emergency Service Wing

Advertisement

Next Story