విజయవాడలో యువకుడి కిడ్నాప్.. నేరాలు పెరుగుతున్నాయా?

by srinivas |
విజయవాడలో యువకుడి కిడ్నాప్.. నేరాలు పెరుగుతున్నాయా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో మరోసారి గూండాయిజం పడగ విప్పుతోందా? నిన్నటికి నిన్న రౌడీషీటర్లు నడిరోడ్డుపై కత్తులు, రోడ్లతో స్వైరవిహారం చేసి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. తాజాగా యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.

విజయవాడలోని నిడమానూరుకు చెందిన రత్నశేఖర్ అనే యువకుడ్ని కృష్ణలంక వద్ద ఆగంతుకులు తాడేపల్లి మండలం ప్రాతూరు కరకట్ట మార్గంలోని ఒక ఇంట్లో బంధించారు. అనంతరం అతని తండ్రి వెంకట్రావుకి ఫోన్ చేసి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపి కృష్ణానదిలో పారేస్తామని హెచ్చరించారు. దీంతో వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, అతనితో కిడ్నాపర్లకు ఫోన్ చేయించి, డబ్బుతో ఎక్కడికి రావాలని అడిగించారు. వారు కూడా తెలివిగా నాలుగైదు ప్రాంతాల పేర్లు చెబుతూ అతనిని తిప్పారు. దీంతో ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేశారు.

కిడ్నాపర్లు ప్రాతూరు కరకట్ట వద్దకు రమ్మనగా వారి సూచనల ప్రకారం అక్కడికి చేరుకున్న పోలీసులు రత్నశేఖర్‌ను కాపాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు తాడేపల్లికి చెందిన రౌడీ షీటర్లు శివకుమార్, సాయిరామ్, రాంబాబుతోపాటు సతీశ్‌, మరో మహిళ ఉన్నట్టు గుర్తించారు. నలుగురినీ అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న నిందితురాలి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు సింగ్‌నగర్ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ రంగంలోకి దిగి పలువుర్ని ఇబ్బంది పెడుతున్నట్టు, దోచుకుంటున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రౌడీషీటర్లు సంపాదనకు సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే విజయవాడ రౌడీలకు, దోపిడీ దారులకు అడ్డాగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story