డిజిటల్ టెక్నాలజీ.. ఇక చదువుకోవడం ఇంకా ఈజీ

by Shyam |   ( Updated:2021-09-20 01:30:17.0  )
డిజిటల్ టెక్నాలజీ.. ఇక చదువుకోవడం ఇంకా ఈజీ
X

దిశ, ఫీచర్స్: మహమ్మారికి ముందు చాలా కంపెనీలు ఏఆర్(అగ్మెంటెడ్ రియాలిటీ), వీఆర్(వర్చువల్ రియాలిటీ) పట్ల ఆసక్తి కలిగి ఉన్నా, కొన్ని మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నాయి. కానీ గతేడాది వచ్చిన కరోనా ప్రభావంతో చాలా సంస్థలు ఇటువైపుగా అడుగులు వేశాయి. దీంతో లాక్‌డౌన్‌లో ఉద్యోగులు రిమోట్‌గా వర్క్ చేసినా, వర్చువల్ వాతావరణంలో ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడిన అనుభూతిని ఈ సాంకేతికత అందించింది. ఇక లెర్నింగ్, టీచింగ్ ప్రక్రియల్లో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ఇప్పటికే సర్వసాధారణమైపోగా.. ప్రస్తుతం ఏఆర్, వీఆర్‌లు కూడా విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాయి. విద్యార్థులకు సుసంపన్నమైన, ఆకర్షణీయమైన, ఇంటరాక్టివ్ విద్యా అనుభవాన్ని అందిస్తూ.. బోధన అర్థవంతంగా, ఇంటరాక్టివ్‌గా మార్చడంలో, క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా చేయడంలోనూ ఈ టెక్నాలజీ దోహదపడుతుంది.

చాక్-టాక్, రూట్ లెర్నింగ్ ప్రక్రియల నుంచి ఎడ్యుకేషన్ విధానం బయటపడి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంతో టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ పూర్తిగా మారిపోయింది. విద్యార్థులు ఇప్పుడు పెద్ద మొత్తంలో డేటా, లెర్నింగ్ మెటీరియల్స్‌ని యాక్సెస్ చేస్తున్నారు. లెర్నింగ్ గ్యాప్ తగ్గించడానికి, లోతైన టాపిక్స్‌పై అవగాహనను పెంచేందుకు ఉపాధ్యాయులు ఆధునాతన ఏఆర్, వీఆర్ సాంకేతికతను ఉపయోగిస్తుండగా, 3-డి ఇమేజరీ, అధునాతన ఆడియో-విజువల్ ఎఫెక్ట్‌ల ద్వారా ఆయా అంశాలను స్పష్టంగా వివరిస్తున్నారు. ఏఆర్, వీఆర్ వల్ల విద్యార్థుల్లో కాన్సెప్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయే అవకాశముండటంతో లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. సంక్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా చేయడంతో పాటు సెల్ఫ్ లెర్నింగ్‌ పెరుగుతుంది. అంతేకాదు ఇది లెర్నర్స్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. రిమోట్ లెర్నింగ్‌ని ఎంగేజింగ్‌గా, ఆసక్తికరంగా చేస్తుంది.

వివిధ అంశాల్లో..

సైన్స్: మానవ, జంతు శరీర నిర్మాణ శాస్త్రం, మాలిక్యులర్ బయాలజీ, కెమిస్ట్రీ, అటామిక్ ఫిజిక్స్ వంటి విషయాలను విద్యార్థులకు బోధించడానికి విద్యా సంస్థలు విజువల్ అండ్ సెన్సార్ పవర్ ఆఫ్ వీఆర్‌ను ఉపయోగిస్తున్నాయి.

హ్యుమానిటీస్: వర్చువల్ పర్యటనల ద్వారా ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు, చారిత్రక స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలను పరిచయం చేస్తూ, అక్కడే లైవ్‌గా ఉండి వీక్షిస్తున్న అనుభూతిని విద్యార్థులను అందించడం వల్ల వారికి సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. దీని వల్ల చరిత్ర, పురావస్తు, రాజకీయ శాస్త్ర విద్యార్థుల లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతోంది. ఆర్ట్స్ విద్యార్థులు ప్రపంచంలోని అగ్రశ్రేణి మ్యూజియమ్‌ల‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, అందులోని కళాఖండాలను వీఆర్ ద్వారా వీక్షించడం గొప్ప అనుభూతి.

బిజినెస్ స్టడీస్: AR/VR ఉపయోగించడం ద్వారా విభిన్న వ్యాపార, ఆర్థిక నమూనాలను విద్యార్థులకు బాగా వివరించవచ్చు. కొనుగోలు-అమ్మకం, ఇన్ స్టోరం ఎక్స్‌పీరియన్స్, ప్రొడక్షన్ లైన్, సప్లయ్ చైన్ మొదలైనవి ఏఆర్/ వీఆర్ వాడకంతో స్పష్టంగా అర్థమయ్యేలా అనుభవపూర్వకంగా బోధించే అవకాశముంది. ఉదాహరణకు, కంపెనీ ఉత్పత్తి చేయాలనుకుంటున్న కారు రూపకల్పన గురించి చర్చించడానికి వారు సమావేశమైతే.. వారందరూ వాస్తవంగా కారు చుట్టూ నిలబడవచ్చు, తిప్పవచ్చు, తలుపులు తెరిచి దాని లోపలి భాగాన్ని చక్కటి వివరాలతో విశ్లేషించవచ్చు.

ఆర్కిటెక్చర్ & ఇంజనీరింగ్: ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీఆర్ టెక్నాలజీని ఉపయోగించి డిజైనర్లు ఊహాత్మకమైన, వినూత్నమైన డిజైన్ 3-D మోడళ్లను సృష్టిస్తున్నారు.

కమ్యూనికేషన్ స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ సామర్ధ్యాలను మెరుగుపర్చడంలోనూ ఈ టెక్ అంశం దోహదపడుతుంది. వీఆర్ ఈ-లెర్నింగ్ వర్చువల్ స్పీచ్ కోర్సులు ఇందుకు ఉపయోగపడతాయి. దీని ద్వారా సభలో ప్రేక్షకుల పరిమాణం ఎంచుకోవచ్చు, పబ్లిక్ స్పీకింగ్, ప్రెజెంటేషన్ నైపుణ్యాలను అభ్యసించే అవకాశం కూడా ఉంది.

ట్రాకింగ్..

ఏఆర్/ వీఆర్ ట్రాకింగ్ అండ్ అనలిటిక్స్ మెకానిజంతోనూ వస్తాయి. ఇది విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడానికి, వారి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి , లెర్నింగ్ జర్నీని పర్యవేక్షించడానికి అధ్యాపకులను అనుమతిస్తుంది. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఈ సాంకేతికత విద్యార్థులలో నాయకత్వం, నిర్వాహకత్వం, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్‌వర్క్ కేపబులిటీస్ వంటి నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడతాయి.

నాలుగేళ్ల క్రితం ఏఆర్/వీఆర్ టెక్నాలజీ ఉన్నా.. ప్రస్తుతం వాటి సాంకేతికతలోనూ విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఈ టెక్నాలజీ అభివృద్ధికి దారితీసే మరో విషయమేమిటంటే, మొబైల్ పరికరాలు కూడా మునుపెన్నడూ లేనంత ఎక్కువ హార్డ్‌వేర్ స్పేస్‌ అండ్ పవర్ కలిగి ఉన్నాయి. దీంతో రెండేళ్ల క్రితం ఎక్కువగా ప్రయోగాత్మక బొమ్మలుగా ఉండే ఈ టెక్నాలజీ ప్రస్తుతం సులభంగా మన జీవితాల్లోకి రాగా, ఆయా రంగాల్లో దూసుకుపోతోంది. అదనంగా వీఆర్ హెడ్‌సెట్‌లు చౌకగా లభిస్తుండటంతో ప్రజాదరణ పొందుతున్నాయి, ఇది టెక్నాలజీలకు డిమాండ్‌ను కూడా పెంచుతుంది.

Advertisement

Next Story