ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు.. యనమల రామకృష్ణుడు సెటైర్లు

by srinivas |
yanamala
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం పెంచడం మాని ఎడా పెడా అప్పులు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో అథమంకు చేరితే.. అప్పుల్లో మాత్రం ప్రథమ స్థానానికి చేరిందని ఆరోపించారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని విమర్శించారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమలు రాక పోగా.. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోవడం శోచనీయమన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. పేదలకు పథకాల పేరుతో రూ.5 ఇచ్చి.. పన్నులు రూపేణ రూ.10 గుంజుకుంటున్నారని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసి వేశారన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప, నక్కా ఆనంద బాబు, పార్టీ నాయకులు బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed