సీఎంకు మహిళా సర్పంచ్‌ లేఖ.. 31 కోట్లు జారీ చేసిన జగన్

by srinivas |
ap-govt
X

దిశ, ఏపీ బ్యూరో : మా రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు వణికిపోతున్నారు. రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఇప్పటికే అనేక మంది ప్రమాదాల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని తక్షణమే రోడ్లు మరమ్మతుకు చర్యలు తీసుకోండి’ అంటూ ఓ గ్రామ సర్పంచ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖకు సీఎంవో స్పందించి మరమ్మత్తులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడి సర్పంచ్ బండి మహాలక్ష్మి రోడ్లపై ప్రజలు పడుతున్న బాధలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.

పి.గన్నవరం మండలంలోని గంటి పెదపూడి నుంచి గన్నవరం వరకు రోడ్లు దుర్భరంగా ఉన్నాయని పెద్దపెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారాయని ఆమె లేఖలో ఆరోపించారు. గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అలాగే బెల్లంపూడి నుంచి నరేంద్రపురం వెళ్లే మార్గం కూడా గుంతలమయంగా మారిందని ఆ రోడ్డు మరమ్మత్తులకు తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ లేఖ సీఎం దృష్టికి చేరుకోవడంతో వెంటనే సీఎంఓ కార్యాలయం ఈ ఉత్తరం పై స్పందించింది. రోడ్ల మరమ్మత్తులకు కావాల్సిన నిధులను విడుదల చేసింది. దీంతో పి.గన్నవరం నుండి గంటి పెదపూడి వరకు వెళ్లే రహదారి మరమ్మతులను అధికారులు చేపట్టారు. సుమారు రూ.31 కోట్ల నిధులతో రోడ్లు బాగుచేశారు. తన లేఖపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, సీఎంవో అధికారులకు సర్పంచ్ బండి మహాలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story