ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమైన ఏపీ.. విత్తనాలు, ఎరువుల పంపిణీ పూర్తి

by srinivas |
ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమైన ఏపీ.. విత్తనాలు, ఎరువుల పంపిణీ పూర్తి
X

దిశ, ఏపీ బ్యూరో: ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. మరో వారం పదిరోజుల్లో వరిసాగు ఆరంభం కానుంది. విత్తనాల కొరత రాకుండా కరోనా కష్టకాలంలో ఆర్టీసీ బస్సులను కార్గో వాహనాలుగా మార్చిన వ్యవసాయశాఖ విత్తనాల పంపిణీ పూర్తి చేసింది. ఎరువులు కూడా విత్తనాల తరహాలో పంపిణీ చేసింది. అయితే, ముందుగా డబ్బులు చెల్లించిన రైతులకు మాత్రమే వీటి పంపిణీ జరగడం విశేషం. మరోవైపు ప్రైవేటు, ప్రభుత్వ ధరలకు పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా రైతులను అసంతృప్తికి గురి చేసింది.

సీసీఆర్‌సీతో కౌలు రైతులకు లబ్ధి

కొద్దిరోజుల్లో పంటల పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతు భరోసాతో రైతుల కళ్లలో ఆనందం చూసిన ప్రభుత్వం కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రణాళికలు రచిస్తోంది. కరోనా కారణంగా ఉపాధికి గండిపడిన నేపథ్యంలో పెట్టుబడి భారంగా మారింది. దీంతో కౌలు రైతులు కష్టాలపాలయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం వారికి లబ్ధి కలిగేలా సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ సర్టిఫికెట్-పంట సాగు హక్కు) పత్రం పొందిన ప్రతి రైతుకూ పెట్టుబడి అందించనున్నట్టు తెలుస్తోంది.
వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సమన్వయంతో దీనిపై కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం సాగు భూమి 40.26లక్షల హెక్టార్లు ఉంది. ఈ భూమిలో 2018-19 సంవత్సరం లెక్కల ప్రకారం 151.12 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని సగటు భూకమతం 0.94 హెక్టార్లైతే, మొత్తం భూకమతాల సంఖ్య 85.24 లక్షలు. 2019 అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాలో భాగంగా ప్రభుత్వం రూ.12,500 సహాయం చేస్తోంది. ఇంకా రైతులకు ఉచితంగా పంటల బీమా సదుపాయం కల్పిస్తోంది. వడ్డీలేని రుణాలు కూడా ఇస్తోంది.

40శాతం భూములు 40.26లక్షల హెక్టార్లలోనే..

40.26లక్షల హెక్టార్లలో 40శాతం భూములు కౌలు రైతుల సాగులోనే ఉన్నాయని వ్యవసాయశాఖ చెబుతోంది. దీంతో వ్యవసాయంలో ఏమాత్రం నష్టం వచ్చినా అది కౌలు రైతే భరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నష్టంలో కొంతైనా ప్రభుత్వం భరించి, కౌలు రైతులకు ఉపశమనం కల్పించేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టానికి ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం ఇకపై కౌలు రైతులకూ దక్కేలా చూడనుంది. కౌలు రైతులను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నాయి. సాగవుతున్న పంటలను వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, కౌలు సర్టిఫికెట్‌ అందజేస్తారు. భూ యజమాని సమ్మతితో సీసీఆర్‌సీ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేస్తారు. దీన్ని వీఆర్వో పరిశీలించి, పంట సాగుదారు అర్హత పత్రం కోసం తహసీల్దార్‌కు ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదన మేరకు తహసీల్దార్‌ సీసీఆర్‌సీ మంజూరు చేస్తారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో కనీసం ఐదుగురు కౌలు రైతులను గుర్తించనున్నారు.

నేరుగా పంట రుణాలు పొందే వెసులుబాటు

ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సాగవుతున్న పంటలను రైతుల వారీగా వ్యవసాయశాఖ సిబ్బంది ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేపట్టనుంది. ఆ సమయంలో సీసీఆర్‌సీ పత్రం ఉన్న కౌలు రైతుల పేరిట పంటను నమోదు చేయనుంది. దీంతో పంటకు నష్టం వాటిల్లితే లబ్ది వారికే ఇవ్వనుంది. అంతేకాకుండా వారికి నేరుగా బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. అయితే, ఇందుకు కనీసం 2.5 ఎకరాల భూమిని రైతులు కౌలు చేయాల్సి ఉంటుంది. తద్వారా సాగు చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు భూమికి యజమానులవుతారని ప్రభుత్వం అంచనా వేస్తొంది.

Advertisement

Next Story