సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ

by Anukaran |   ( Updated:2020-10-10 11:19:48.0  )
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించేట్లు దిశానిర్దేశం చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం వైఎస్​ జగన్​ లేఖ రాశారు. 8న లేఖ ప్రతులను సుప్రీం కోర్టుకు పంపినట్లు ప్రభుత్వ సలహాదారు అజయ్​కల్లం శనివారం రాత్రి అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్‌లో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించే దాకా జరిపిన ప్రత్యుత్తరాలను లేఖలో ప్రస్తావించారు. సీబీఐ విచారణ కోరిన సంగతి కూడా పేర్కొన్నారు. గత ప్రభుత్వాధినేత చంద్రబాబుకు సుప్రీం కోర్టు జస్టిస్​ ఎన్​వీ రమణకు ఉన్న సంబంధాలను ఉటంకించారు.

ఇటీవల గౌరవ హైకోర్టు అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ జీవోపై స్టే ఇవ్వడం నుంచి మాజీ అడ్వకేట్​ జనరల్ ​దమ్మాలపాటి కేసు విషయంలో ఇచ్చిన గ్యాగ్​ఆర్డర్​ దాకా జరిగిన పరిణామాలను లేఖలో తెలియజేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటికీ సంబంధించిన ఆధారాలతో లేఖను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు అజయ్​కల్లం వెల్లడించారు.

Advertisement

Next Story