శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడేలానే రంజాన్ చేసుకోండి: జగన్

by srinivas |
శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడేలానే రంజాన్ చేసుకోండి: జగన్
X

కరోనా వైరస్ కేసులు ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనలోకి నెడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి
ఇళ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్న సంగతిని గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో కరోనా ప్రభావం ఉండకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయని ఆయన తెలిపారు. అందులో భాగంగానే లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పవిత్ర మాసం, నమ్మకాల పేరిట సామూహిక ప్రార్ధనలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

హిందువులు ఘనంగా చేసుకునే శ్రీరామనవమి, క్రైస్తవులు ఘనంగా నిర్వహించే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలు ఏకాంతంగా నిర్వహించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వారి మాదిరిగానే ముస్లింలు కూడా తమ పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించాలని ఆయన స్పష్టం చేశారు. రంజాన్‌మాసంలో ముస్లిం సమాజం మొత్తం కరోనా వైరస్ నిరోధానికి తమతమ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రధానంగా మత పెద్దలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెయ్యాలని ఆయన చెప్పారు. కష్టమైనప్పటికీ ఆచరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Tags: ysrcp, muslims, jagan, ap cm, video conference

Advertisement

Next Story

Most Viewed