మన్యంలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం

by Sridhar Babu |   ( Updated:2021-12-05 23:13:49.0  )
మన్యంలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం
X

దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న వేళ భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో ‘నక్సలిజం వద్దు.. అభివృద్ధి ముద్దు’ పేరిట వెలిసిన కరపత్రాలు చర్చనీయాంశమైనాయి. అందులో ఇలా రాసి ఉంది. విధ్వంసాన్ని అడ్డుకుందాం.. అభివృద్ధికి పట్టం కడతాం. ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్న నక్సలైట్లను తరిమికొడదాం. విప్లవోద్యమంలో చేరమని రెచ్చగొట్టే వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. మన పిల్లలను అడవిలోకి పంపుతున్నారు. ఆదివాసీ బిడ్డల చేత తుపాకీ పట్టిస్తున్న నక్సలైట్లను ఏరిపారేద్దాం.

విప్లవం అంటే రోడ్లను వాహనాలను ధ్వంసం చేయడమేనా అని ప్రశ్నిద్దాం. దండకారణ్యంలోని ప్రజలుచేసిన పాపం ఏంటి‌ ? ఇంకా వాళ్ళు రాతియుగంలోనే బ్రతకాలా ? ఆదివాసీ బిడ్డలకు విషపు సిద్ధాంతాలను నేర్పిస్తున్న నక్సలైట్లను అడ్డుకుందాం. ప్రపంచం టెక్నాలజీ దిశగా మారుతోంది. ఆదివాసీల తలరాతలు మారేదెప్పుడు ? ఆదివాసీలను పావులుగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం. అణగారిన వర్గాల గిరిజనుల, ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకోవడం నేరం కాదా ? ఇంకా ఎన్నాళ్ళు ఈ అరాచకాలు ? ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి బాటలో పయనించండి. ముందు తరాలకు వెలుగునివ్వండి. ప్రజలారా ఏకమవ్వండి.. మావోయిస్టులకు ఎదురు తిరగండి అని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. పలు గ్రామాల్లో, ప్రధాన కూడళ్ళు, బస్టాండ్‌లలో వెలసిన ఈ కరపత్రాలను ప్రజలు గుంపులుగా చేరి చదువుతున్నారు. ఇందులో రాసిఉన్న అంశాలపై చర్చిస్తున్నారు.

Advertisement

Next Story