చరిత్ర సృష్టించిన అంకిత రైనా

by Shiva |
చరిత్ర సృష్టించిన అంకిత రైనా
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా చరిత్ర సృష్టించింది. స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తర్వాత డబ్ల్యూటీఏ టైటిల్ సాధించిన భారతీయురాలిగా రికార్డుల్లోకెక్కింది. అంకిత రైనా తన భాగస్వామి రష్యాకు చెందిన కామిల్లా రఖిమోవాతో కలసి ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. అంకిత రైనాకు ఇదే తొలి డబ్ల్యూటీఏ టైటిల్ కావడం విశేషం. అంతే కాకుండా ప్రపంచ టెన్నిస్ టాప్ 100 ర్యాంకుల్లో ప్రవేశించి సానియా సరసన నిలిచింది. శుక్రవారం రష్యాకు చెందిన అన్నా బ్లింకోవా, అనెస్తీషియా పటపోవా జంటపై 2-6, 6-4, 10-7 తేడాతో అంకిత, కామిల్లా జోడి గెలుపొంది చాంపియన్స్‌గా నిలిచారు.

ఈ విజయంతో 8వేల డాలర్ల ప్రైజ్ మనీతో పాటు 280 ర్యాంకింగ్ పాయింట్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో అంకిత రైనా 115వ ర్యాంకు నుంచి 21 స్థానాలు ఎగబాకి 94వ ర్యాంకుకు చేరుకున్నది. గతంలో సానియా మీర్జా తప్ప ఏ భారత మహిళా ప్లేయర్ 100 లోపు ర్యాంకుల్లో నిలవలేదు. గత వారంలో ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు నేరుగా ఎంపికైన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన అంకిత.. రెండవ రౌండ్‌లో వెనుదిరిగింది. అయితే శుక్రవారం ఏకంగా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Advertisement

Next Story