మహిళల ఓట్లపై వైసీపీ ఆశలు..అన్ని నియోజకవర్గాల్లో వారిదే ఎక్కువ ఓటింగ్

by Jakkula Mamatha |
మహిళల ఓట్లపై వైసీపీ ఆశలు..అన్ని నియోజకవర్గాల్లో వారిదే ఎక్కువ ఓటింగ్
X

దిశ ప్రతినిధి, కడప:ప్రభుత్వ పథకాల్లో మహిళలకు పెద్ద పీట వేసిన వైసీపీ వారి నుంచి పూర్తి సహకారం అందుతుందన్న ఆశల్లో ఉంది. దీనికి తోడు మహిళల ఓట్లు పురుషుల కంటే ఎక్కువగా పోల్ కావడంతో కడప జిల్లాలో గెలుపు తమదే అన్న ఆశల్లో ఉంది. మహిళలు ఓటింగ్ శాతం అధికంగా ఉండడంతో ఎన్నికల తీర్పులో వారి తీర్పే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆ ఓట్లపై ధీమాగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకతతోనే మొత్తం ఓటింగ్ శాతం పెరిగింది అన్న అంచనాల్లో టీడీపీ ఉంది. ఇలాంటి అంచనాలతో వైసీపీ సాలిడ్‌గా ఉన్న రెండు మూడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల ఓటింగ్ సరళి ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.

*సంక్షేమం పని చేసిందా?

ఎన్నికల్లో మహిళల పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటం, వీరితోపాటు సంపన్న వర్గాల కంటే పేద వర్గాల ఓట్లు ఎక్కువగా పోలుకావడం లాంటి పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పనిచేశాయా? ఆ పథకాలు పొందిన వారు ఆయనకు అనుకూలంగా ఓటు వేసే క్రమంలోనే ఓటింగ్ శాతం ఇంతగా పెరిగిందా? అన్న అభిప్రాయాలు ఒకవైపు ఉన్నాయి. అదే తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకతతో పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారని టీడీపీ వర్గీయులు చెప్పుకొస్తున్నారు .అయితే ఇక్కడ ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాలు ,మధ్యతరగతి పైనున్న వారి ఓట్ల శాతం తగ్గడంతో తెలుగుదేశం పార్టీ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి .మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం ప్రకారం సంక్షేమ పథకాలు ఎక్కువగా మహిళలకు అందడం, పేద కుటుంబాలకు చేరడంతో ఆ ఓటింగ్ సరళి వైసీపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తూ వచ్చారు. ఈ తరుణంలో ఈ ఈ వర్గీయుల ఓటు ఎక్కువగా పోలుకావడంపై వైసీపీ ఫలితాలపై ఆశల్లో ఉంది.

*ఓటింగ్‌లో నారీ భేరి..!

వైయస్సార్ జిల్లాలోని కడప పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ నారీ బేరి‌మోగింది. మహిళల ఓట్లే అధికంగా పోలయ్యాయి. ఏడు అసెంబ్లీలో 669820 మహిళా ఓట్లు పోలుకాగా 634349 మంది పురుషుల ఓట్లు పోలయ్యాయి. అంటే పురుషులకు కంటే 35471 మహిళల ఓట్లు అధికంగా పోలింగ్ కావడం కీలకంగా మారింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన మహిళలు ఓటింగ్‌ను పరిశీలిస్తే..బద్వేలు అసెంబ్లీ లో 84 491 ఓట్లు పురుషులు వేయగా, 88167 ఓట్లు మహిళలు వేశారు. కడప అసెంబ్లీలో 88536 పురుషుల ఓట్లు పోలుకాగా 96511 ఓట్లు మహిళలు వేశారు. పులివెందులలో 91484 మంది పురుషుల ఓటు వేయగా మహిళలు 95340 ఓట్లు వేశారు.

కమలాపురం నియోజకవర్గంలో 83917 ఓట్లు పురుషులు వేయగా 88472 ఓట్లు మహిళలు వేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 102789, ఓట్లు పురుషులు ,107449 ఓట్లు మహిళలు వేశారు. ప్రొద్దుటూరులో పురుషులు 95260 ఓట్లు వేయగా ,మహిళలు 102062 ఓట్లు వేశారు. మైదుకూరు అసెంబ్లీలో పురుషులు 87872 ఓట్లు, మహిళల ఓట్లు 91819 పోలయ్యాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళల ఓట్లు అధికంగా పోల్ కావడం ఎన్నికల ఫలితాలపై కీలక అంశంగా మారింది. మరి మహిళా తీర్పు వైసీపీ ఆశించినట్లు ఉంటుందా..అందుకు భిన్నంగా ఉంటుందా అన్నది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed