పాత పెన్షన్ ఇచ్చే వారికే మా మద్దతు: UTF

by srinivas |
పాత పెన్షన్ ఇచ్చే వారికే మా మద్దతు: UTF
X

దిశ, కడప: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వారికే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా పేర్కొన్నారు. కడప యుటీఎఫ్ భవన్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.లక్ష్మీరాజా మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించారని మండిపడ్డారు. నాలుగేళ్లు కాలయాపన చేసి సీపీఎస్ స్థానంలో జీపీఎస్ పేరుతో పెన్షన్ స్కీమ్‌ అమలు చేసి ఉద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే విద్యను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే సాకుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి విద్యను అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, ఏపీజిఎల్ఐ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ, పిఆర్సీ, సరెండర్ లీవ్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజిఎల్ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed