అచ్చెన్న మంత్రం ఫలించేనా.. కోనసీమ టీడీపీలో నూతనోత్తేజం కలిగేనా?

by Shiva |
అచ్చెన్న మంత్రం ఫలించేనా.. కోనసీమ టీడీపీలో నూతనోత్తేజం కలిగేనా?
X

దిశ, కోనసీమ ప్రతినిధి: కోనసీమ జిల్లా టీడీపీకి కంచుకోట. సర్పంచ్ నుంచి శాసన సభ్యుల దాకా ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం ఇక్కడ ఆనవాయితీ. గత ఎన్నికల్లో కూడా కూటమిలో మొత్తం నియోజకవర్గాల్లో రెండు చోట్ల జనసేన, మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతటి ప్రాముఖ్యత గల జిల్లాలో అనేక మంది టీడీపీ శాసన సభ్యులు నిరాశానిస్పృహల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని కొందరు, పదవి ఇచ్చినా గానీ సరిగా పనిచేయలేక మరికొందరు సతమతమవుతున్నారు. పార్టీలో ఈ విషయం పెద్ద చర్చగా మారింది. ఇదే ధోరణి కొనసాగితే రాబోవు రోజుల్లో పార్టీకి గడ్డు కాలమే అని అధిష్టానం భావిస్తోంది. దీనిని గమనించిన చంద్రబాబు పక్కాగా ప్రణాళిక రచించారు. ఎలాగైనా సరే కంచుకోటకు చెక్కు చెదర కూడదనే ఉద్దేశ్యంతో జిల్లాకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడును ఇక్కడ ఇన్చార్జిగా నియమించారు. ఆయన మంగళవారం జిల్లాలో తొలి పర్యటన చేశారు. అచ్చెన్న సమక్షంలో నేతలు కష్టపడి పనిచేస్తారని, నిరాస నిస్పృహలు విడనాడి కార్యకర్తలో ఉత్తేజం తీసుకొని వస్తారని అనేక మంది భావిస్తున్నారు.

సుభాశ్ ఆడియో హల్‌చల్ ..అచ్చెన్న మంత్రం ఫలించేనా.. కోనసీమ టీడీపీలో నూతనోత్తేజం కలిగేనా?

మంత్రి సుభాశ్‌ను ఇటీవల అధినేత చంద్రబాబు శాసన మండలి సభ్యుల ఓటర్ల నమోదు విషయంలో మందలించారు. సదరు సంభాషణ బయటకు పొక్కింది. దీంతో ఇది పార్టీలో పెద్ద చర్చగా మారింది. అంతరంగిక వ్యవహారం బయటకు ఎలా వచ్చిందంటూ ఆరా తీస్తున్నారు. పార్టీలోనే కిట్టని వారు ఈ పని చేశారని భావిస్తున్నారు. అంతేగాక మంత్రి సుభాశ్ పనితీరు పట్ల కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, కుటుంబ సభ్యుల జోక్యం అధికంగా ఉందని, మంత్రి కనీసం ఫోన్ కూడా తీయడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని సరిదిద్దే బాధ్యతను అచ్చెన్నకు అధిష్టానం అప్పగించింది.

సీనియర్ ఎమ్మెల్యే బండారు అలక పాన్పు..

పార్టీలో సీనియర్ నేత అయిన కొత్తపేట శాసన సభ్యుడు బండారు సత్యానందరావు అలక పాన్పు ఎక్కారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని నెగ్గిన నాటి నుంచి ముభావంగా ఉన్నారు. ఇటీవల కనీసం తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ పదవి అయినా ఇస్తారని ఆశించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆయన నిరుత్సాహంగా కనపడుతున్నారు. సదరు విషయం కూడా ఇన్చార్జి మంత్రి చూసుకోవాల్సిందే.

అమలాపురం ఎమ్మెల్యేదీ అదే బాట..

అమలాపురం శాసన సభ్యుడు అయితాబత్తుల ఆనందరావు కూడా మంత్రి పదవి దక్కలేదనే బాధలో ఉన్నారు. ఎస్సీ కోటాలో తనకు ఖచ్చితంగా పదవి దక్కుతుందనే నమ్మకంలో ఉన్న ఆయనకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోనసీమ ముఖ కేంద్రమైన అమలాపురం శాసన సభ్యుడే ఇలా ముభావంగా ఉండటంపై అధినేత చంద్రబాబు చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

కష్టపడి పనిచేస్తున్న బుచ్చిబాబు..

ముమ్మిడివరం శాసన సభ్యుడు దాట్ల సుబ్బరాజు క్షత్రియ కోటాలో మంత్రి పదవి కావాలని ఆశించారు. కానీ ఆయన ఆశ కూడా నెరవేరలేదు. అయితే బుచ్చిబాబు మాత్రం వాటిని పక్కనపెట్టి కష్టపడి పనిచేస్తున్నారు. ఇటీవల అతనికి చంద్రబాబు తీసిన ర్యాకింగ్‌లో మంచి మార్కులు వచ్చాయి. ఆయనను అమాత్య పదవిలో చూడాలని అనేక మంది కోరుకుంటున్నారు. కేడర్ కూడా గట్టిగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఇటువంటి అంతరంగిక సమస్యలు పరిష్కరించే పనిలో మంత్రి అచ్చెన్న పడ్డారు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed