AP News:కూటమి ప్రభుత్వంలో ఆదివాసులకు అండగా నిలుస్తాం:సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
AP News:కూటమి ప్రభుత్వంలో ఆదివాసులకు అండగా నిలుస్తాం:సీఎం చంద్రబాబు
X

దిశ, డైనమిక్‌ బ్యూరో:చైతన్యం 0.2 ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తమ ప్రభుత్వంలో చైతన్యం అనే కార్యక్రమం చేపట్టినట్లు గుర్తు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆదివాసీల కళలకు, సంప్రదాయాలకు ప్రత్యేకత ఉందని తెలిపారు. ఏకలవ్యుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడని అన్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. బిర్సాముండా, కొమరంభీంలను ఆయన గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఎనలేనిదని తెలిపారు. ఆయన దేశానికే ముద్దు బిడ్డ అని సీఎం అన్నారు. వీరందరినీ జాతి మరువబోదన్నారు. మన రాష్ట్రంలో 5.5శాతం ఆదివాసీలు ఉన్నారు.

27లక్షల 39 వేల మంది గిరిజనులు ఉన్నారని తెలిపారు. చైతన్యం అనే కార్యక్రమంతో గతంలో గిరిజనుల అభ్యున్నతికి పని చేశామని అన్నారు. ఆదివాసిల ఆహార ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని తెలిపారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి అరకు కాఫీ ఇచ్చి, ఆయన బ్రాండ్‌ అంబాజిడర్‌గా చేశామని గుర్తు చేశారు. ఆదివాసీల్లో శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ గురించి మాట్లాడుతున్నాం కానీ.. ఇంకా డోలీ మోతలు వినడంతో మంచిది కాదని సీఎం పేర్కొన్నారు. ఆదివాసీల అభ్యున్నతికి పాటు పడతామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలను పునరుద్దరిస్తామని అన్నారు. గిరిజనుల్లో ప్రతిభ ఉందని, దానిని సానబెడతామని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో తాము బాక్సైట్‌ తవ్వకాలను ఆపివేశామని గుర్తు చేశారు.

ఏజన్సీలో టూరిజం అభివృద్ధి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చేస్తామని తెలిపారు. మనం చేసే ప్రతి పని గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అధికారులకు సూచించారు. మెగా డీఎస్సీ అభ్యర్థులకు విశాఖ, విజయవాడ, తిరుపతిలో కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. చింతపల్లి మండలం లంబసింగిలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్గానిక్‌ పంటలను ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసే వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపడతామన్నారు. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు ఏర్పాటు చేస్తాం అని సీఎం అన్నారు. పాడేరులో ఉన్న మెడికల్‌ కాలేజిని పూర్తి చేస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఆదివాసీలతో సీఎం ముఖాముఖి..

ఆదివాసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమం జరిగింది. చిరుధాన్యాలతో మల్టిగ్రెయిన్‌ బిస్కెట్లు తయారు చేసే కుటీర పరిశ్రమను కొనసాగించాలని ఏలూరుకు చెందిన మహిళ కోరారు. ఎన్టీఆర్‌ నుంచి జ్యోతి అనే మహిళ మాట్లాడుతూ కుట్టుమిషన్లతో 10 మంది ఉపాధి పొందుతున్నామని తెలిపారు. తమకు స్కూల్ యూనిఫామ్ కుట్టేందుకు అవకాశం ఇప్పించాలని కోరారు. ఏకుల రవి మాట్లాడుతూ తమ యానాది జాతిని గుర్తించాలని కోరారు. జీవనాధారం కల్పించాలని అన్నారు. చేపల వేటకు సబ్సిడీ లోన్స్ ఇప్పించాలని అడిగారు. ఇంకా పలు ప్రాంతాల నుంచి ఆన్‌లైన్లలో ఆదివాసీలు పాల్గొన్నారు.

గిరిజన సంప్రదాయ నృత్యంలో..

తొలుత గిరిజనుల సంప్రదాయ ధింసా నృత్యంలో ఆయన పాల్గొన్నారు. కళాకారులతో కలిసి డప్పు వాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ముగ్గును ఆసక్తిగా పరిశీలించారు. పూలతో గిరిజన నృత్య కళాకారులు చిత్రాన్ని ఏర్పాటు చేశారు. లంబాడీ మహిళలు నృత్యంతో ఆయనకు స్వాగతం పలకరించారు. కొమ్ములతో చేసిన తలపాగాను ఆయనకు అందించారు. అక్కడ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. తేనె ఉత్పత్తులు, పట్టు పురుగులను పరిశీలించారు. అరకు కాఫీని ఆయన రుచి చూశారు. కాఫీ చాలా అద్భుతంగా ఉందన్నారు. దానిని మార్కెటింగ్‌ చేయడానికి పలు సూచనలు చేశారు. గిరిజన ప్రాచీన కళాకృతులను పరిశీలించారు. చెంచులు ప్రదర్శించిన ఆయుర్వేద మూలికలను చూశారు. ఆయన వెంట మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోండ ఉమ, పంచుమర్తి అనురాధ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ కన్నబాబు, పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు ధారునాయక్‌ ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed