AP News:‘మాదిగలకు అండగా ఉంటా’..సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |
AP News:‘మాదిగలకు అండగా ఉంటా’..సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు!
X

దిశ ప్రతినిధి,విజయవాడ: మాదిగలకు అండగా నిలబడి వాళ్ళని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సుజనాకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం ప్రెజర్ పేట నుంచి చిట్టినగర్ మీదుగా మిల్క్ ప్రాజెక్టు వరకు రోడ్ షోలో పాల్గొన్నారు.మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన మాదిగల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. మందకృష్ణ తనకు సోదరుడితో సమానమని, తామిద్దరి మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉందని సుజనా చెప్పారు. రాజకీయంగా ఎన్నో అవకాశాలు వచ్చినా, జాతి హితం కోరి ఉద్యమ బాటలోనే మందకృష్ణ పయనిస్తున్నారని ప్రశంసించారు.

మందకృష్ణకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు అండగా ఉంటానని సుజనా చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే మాదిగల సమస్యలు పరిష్కరించి, అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటానని సుజనా హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి ఎంఆర్ పీఎస్ మద్దతు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ వర్గం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారంటూ, మోదీ, చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు జరిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు శాపంగా మారిన జగన్‌ను ఇంటికి పంపాలని సుజనా పిలుపునిచ్చారు.

మాదిగల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సుజనా చౌదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ ఎన్డీయే కూటమి తోనే సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్నారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు జరిగిందని, మోడీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో విద్యా ఉద్యోగం సంక్షేమం రాజకీయంగా దళితులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

సుజనా చౌదరి పెద్దన్న తో సమానం అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న సుజనాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తామన్న ఎన్డీయే కూటమికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జ్ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెరెల్లి ఎలీషా, తుపాకుల రమణమ్మ, లింగాల నరసింహులు, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Next Story