అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. విప్లవాత్మక నిర్ణయాలతో సరికొత్త మార్పులు

by srinivas |
అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. విప్లవాత్మక నిర్ణయాలతో సరికొత్త మార్పులు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమౌతుందని డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం, మంత్రులు మాట్లాడారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఒక పక్క అభివృద్ధి మరోవైపు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అందుకే రూ.4,700 కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నారని, తెలంగాణలో ఎయిర్ పోర్టు కలిగిన శంషాబాద్ తరహాలోనే భోగాపురం ప్రాంతం కూడా అబివృద్ధి చెంది 50 వేల మంది వరకు ఉపాధి లభించనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సారిపల్లి ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నట్లు చెప్పారు. ఇలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త మార్పులు తీసుకొస్తూ జగన్ సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. పథకాలతో జగన్ డబ్బును దుర్వనియోగం చేస్తున్నాడని ఓసారి జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తానని మరోసారి విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఈ రెండింటిలో దేనికి కట్టుబడి ఉంటాడో చెప్పాలన్నారు.


నాడు మామూలు..నేడు చట్టబద్దత

బ్రిటీష్ కాలంలో మామూలు భూముల సర్వే జరిగిందని, నేడు వైసీపీ ప్రభుత్వం రైతులకు తమ భూములపై సరైన హక్కు పత్రాలను అందచేస్తూ చట్టబద్ధత కల్పిస్తోందని డిప్యూటీ సీఎం, మంత్రులు అన్నారు. ఇలాంటి పనులను గత ప్రభుత్వాలు చేశాయా అని నిలదీశారు. జమీందార్లు, భూస్వాములు, రాజుల వద్ద లక్షల ఎకరాల భూమి ఉంటే సీఎం జగన్ వాటిని పేదలకు పంపిణీ చేశారన్నారు. భూ పంపిణీతో పేదలకు సామాజిక హోదాను జగన్ కల్పించారన్నారు. రాష్ట్రంలో అన్ని హంగులున్న ఏకైక అతి పెద్ద నగరమైన విశాఖను రాజధాని చేయాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫారసు చేస్తే రాత్రికి రాత్రి అమరావతిని రాజధాని చేసి చంద్రబాబు కేంద్రం నిర్ణయాన్ని తొక్కి పెట్టారన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల అదృష్టశావత్తు జగన్ సీఎం అయి విశాఖను రాజధాని చేస్తానంటే ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed