Cyclone Michoung : మరికాసేపట్లో తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను

by Seetharam |   ( Updated:2023-12-05 07:18:48.0  )
Cyclone Michoung  : మరికాసేపట్లో తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను
X

దిశ, డైనమిక్ బ్యూరో : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను మరో రెండు గంటల్లో తీరాన్ని దాటబోతుంది. ఇప్పటికే తాపాను తీరాన్ని సమీపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెను తుపాను దక్షిణ కోస్తా తీరం వైపు ఉత్తర దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒంగోలుకు 25 కి.మీ, బాపట్లకు 60 కి.మీ, మచిలీపట్నానికి 130 కి.మీ.దూరంలోతుపాను కేంద్రీకృతమై ఉంది. మరో గంటలలోపు బాపట్ల దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఇప్పటికే దట్టమైన మేఘాలు సగభాగం భూ ఉపరితలం మీదకు వచ్చేశాయని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తుపాను తీరం దాటిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

9 జిల్లాలకు రెడ్ అలర్ట్

మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని 9 జిల్లాలకు వైసీపీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,పశ్చిమగోదావరి, ఏలూరు,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించింది. మరోవైపు తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మెుత్తం 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించించింది.

సురక్షితంగా ఉండండి

తీర ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి సమయాల్లో చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు అని సూచించింది. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed