Ward Vollunteers: ఉంచుతారా.. తీసేస్తారా.. వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి..?

by srinivas |
Ward Vollunteers: ఉంచుతారా.. తీసేస్తారా.. వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వార్డు వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 50 ఇళ్లకు ఒకరిని చొప్పున గత ప్రభుత్వం 2 లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది. ఐదేళ్ల పాటు వారి సేవలను వినియోగించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వారిపై ఈసీ ఆంక్షలు విధించింది. పథకాల లబ్ధిదారులకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. దీంతో రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతల వల్లే వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిందని ఆరోపించారు. అంతేకాదు చాలా మంది వార్డు వాలంటీర్లతో రాజీనామా చేశారు. తామే అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పింఛన్ల పంపిణీలో ఒక్క వాలంటీర్‌ను కూడా ప్రభుత్వం వినియోగించుకోలేదు. సచివాలయ సిబ్బందితోనే ఎప్పటిలాగే ఫస్ట్ తారీకునే 90 శాతం పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.

దీంతో వార్డు వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. జీతాలు సైతం పెంచుతామని హామీ ఇచ్చారు. జులై నెలల్లో పింఛన్‌దారులకు అందజేసిన నగదులో వారిని వినియోగించుకోలేదు. మరోవైపు రాజీనామాలు చేసిన వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోమని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెగేసి చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. అయినా వార్డు వాలంటీర్లపై ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. అసలు వార్డు వాలంటీర్లను వినిగిస్తారా లేదా అనేది సైతం చెప్పాలేదు. అటు రాజీనామా చేసిన వాలంటీర్ల స్థానంలో కొత్త వారికి తీసుకుంటారా అనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. దీంతో వాలంటీర్లలో సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.



Next Story