పొత్తు చిచ్చు.. జనసేన (Jana Sena), టీడీపీ (TDP) ఆశావహుల్లో టెన్షన్

by Seetharam |   ( Updated:2022-10-26 04:12:32.0  )
పొత్తు చిచ్చు.. జనసేన (Jana Sena), టీడీపీ (TDP) ఆశావహుల్లో టెన్షన్
X

దిశ, ప్రతినిధి ఉభయ గోదావరి : ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఇరు పార్టీల పొత్తుపై జోరుగా చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమ కూటమీదేనని ఆయా పార్టీల కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు. అయితే పొత్తుల్లో భాగంగా ఏ నియోజకవర్గం ఎవరికి వెళ్లిపోతుందోనని ఆయా చోట్ల నేతల్లో టెన్షన్ మొదలైంది.

ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో ఇటు జనసేన, అటు టీడీపీ నేతలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. టికెట్ తమకే వస్తుందని ఆశగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలల్లో పొత్తులు కుదిరితే తమకు సీటు దక్కుతుందో.. లేదోనని వారిలో టెన్షన్ మొదలైంది. చాలాకాలం సీటు కోసం కాచుకు కుర్చున్న నేతలకు చుక్కెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కులాల సమీకరణే ముఖ్యం..

కుల రాజకీయాలు మంచిది కాదని ఆయా రాజకీయ పార్టీల అధినేతలు బయటకు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉండదు. బలమైన సామాజికవర్గం వారికే టికెట్ ఇచ్చేందుకు ఆయా పార్టీల అధినేతలు మొగ్గు చూపుతుంటారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కులాల సమీకరణ కావచ్చు, పొత్తుల్లో భాగంగా తమ టికెట్ చేజారిపోతుందేమోనని ఆయా పార్టీల ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఇక్కడ ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఇక్కడ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇక టీడీపీ ఇక్కడ తీసిపోలేదు. ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీకి క్యాడర్ ఉంది.

కొత్తపేట పరిస్థితి ఏంటి?

ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల నుంచి టికెట్ కోసం అనేక మంది సీనియర్ నేతలు ఎదురుచూస్తున్నారు. తాజాగా రెండు పార్టీలు మిత్రులవ్వడంతో వారిలో కొందరికి మొండి చెయ్యి దక్కే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా.. కొత్తపేట నియోజక వర్గం నుంచి టీడీపీ తరుపున పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు టికెట్ ఆశిస్తున్నారు. అదే సెగ్మెంట్ నుంచి సత్యానందరావు సొంత తమ్ముడు శ్రీనివాసరావు జనసేన సీటును ఆశిస్తున్నారు. వీరు గత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఈసారి రెండు పార్టీలు మిత్రపక్షం అవ్వడం వల్ల ఒక్కరికే అవకాశం దక్కుతుంది. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న మీమాంస నెలకొన్నది.

పిఠాపురం నుంచి పవన్ పోటీ?

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు జనసేన కార్యాలయం నుంచి లీకులు వస్తున్నాయి. ఇక్కడ జనసేన టికెట్ ఆశిస్తున్న నేత పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది. మరోవైపు కాకినాడ-2 నుంచి పంతం నానాజీ జనసేన సీటు ఆశిస్తున్నారు. సీనియర్ లీడరుగా మంచి గుర్తింపు ఉంది. పొత్తుల్లో భాగంగా ఆయనకు టికెట్ దక్కుతుందో లేదో తెలియదు. ఇలా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది.

ఇవి కూడా చ‌ద‌వండి

1.ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి నిరాకరించడంతో 11 మందిపై దాడి..

Advertisement

Next Story