కులగణనతో టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయి: మంత్రి చెల్లుబోయిన వేణు

by Seetharam |
కులగణనతో టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయి: మంత్రి చెల్లుబోయిన వేణు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అందుకు అడుగులు సైతం పడటంతో టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయి అని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. బీసీల దెబ్బకు టీడీపీ కుప్పకూలిపోవడం ఖాయం అని అన్నారు. కులగణన చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం అధికారమిచ్చింది. అందుకే బీహార్‌లో కూడా కులగణన జరిగింది. రాష్ట్రం చేసే కులగణనకు చట్టబద్ధత లేదనడం పచ్చి అబద్ధం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాతో మాట్లాడారు. పథకాల రద్దుకే బీసీల కులగణన అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఖండించారు. ఒక పెద్ద అబద్ధాన్ని ప్రమోట్‌ చేయాలని ఆలోచనలతో ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. అబద్ధానికి, కుట్రకు, కుతంత్రానికి ఒక రూపం చంద్రబాబు అని మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు.

అబద్ధానికి, కుట్రలు కుతంత్రాలకు చంద్రబాబు నిలువెత్తు రూపం

అబద్ధానికి, కుట్రలు కుతంత్రాలకు నిలువెత్తు రూపం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. తెలంగాణలో 26 బీసీ కులాలను జాబితా నుంచి తొలగిస్తే మాటైనా మాట్లాడావా బాబూ...? అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు చేసిన ఇలాంటి మోసాలన్నిటినీ బీసీలు గమనించారు. అందుకే జగన్‌ని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలంతా గుండెల్లో పెట్టుకున్నారు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. బాబు అనే అబద్ధానికి ఆరు రూపాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. లోకేశ్ ఒక పప్పు..పవన్ ఒక ఉప్పు..సమాజానికి వీరు ముప్పు అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది బీసీల ప్రభుత్వం..పేదవాడి జీవన ప్రమాణాన్ని పెంచడమే జగన్‌ లక్ష్యం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో మోసపోయిన బీసీలు

చంద్రబాబు నాయుడు హయాంలో తామంతా మోసపోయామని బీసీలు తెలుసుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి..జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలు చైతన్యవంతులయ్యారని చెప్పుకొచ్చారు. వాస్తవాలు తెలుసుకున్నారు..బాబు హయాంలో తాము మోసపోయామని తెలుసుకున్నారన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఈ వర్గాలను జీవన ప్రమాణాలు పెరగకుండా చేశాడని మండిపడ్డారు. పేద వాడి ఆశలు నెరవేరక, తన ఆత్మగౌరవాన్ని మీలాంటి పెత్తందారుల వద్ద తాకట్టు పెట్టి జీవించే స్థితి నుంచి నేడు మార్పు వచ్చింది అని అన్నారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఏ పేదవాడు పెత్తందార్ల వద్దకు వెళ్లనవసరం లేకుండా డీబీటీ అనే విధానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. పెత్తందారులు వీరిని ఎలా దోచుకుంటున్నారో జగన్‌ గమనించి ఈ డీబీటీ తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. నేడు రూ.2.40లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది... దాంట్లో అవినీతి జరిగిందని మీరు చెప్పగలవా? నిలదీశారు. అదే చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీలు ఎన్ని ఘోరాలు చేశారో అందరూ చూశారు. పింఛన్‌ ఇవ్వాలంటే వృద్ధుల వద్ద లంచాలు తీసుకున్నారు అని ధ్వజమెత్తారు. ఇళ్లివ్వాలంటే యజమానికి వచ్చేది రూ.40వేలు అయితే పదిశాతం చొప్పున రూ.4వేలు లంచాలు తీసుకున్నారు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు.

చంద్రబాబు అబద్ధం

బాబు ఆబద్ధమైతే..ఎల్లోమీడియా పవన్‌ లాంటి వారు ఆబద్ధానికి మరో రూపాలు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. చంద్రబాబు అబద్ధమైతే..దానికి ఆరు రూపాలున్నాయన్నారు. కొత్తగా వచ్చిన రూపం పవన్‌ కల్యాణ్‌ అని చెప్పుకొచ్చారు. ‘ఇంకో రూపం లోకేశ్‌..ప్రజల్లోకి వస్తే ఇతను పప్పు అని తీర్పునిచ్చారు. పాదయాత్ర చేయమంటే అది కాస్తా చప్పబడిపోయింది. చప్పబడిన పప్పు కూడు పనికిరాదని ఉప్పును తీసుకురమ్మన్నావు. ఆ ఉప్పు పవన్‌ కల్యాణ్ ఏదో సాధిస్తాడు అనుకుంటే అదీ కుదరలేదు. తెలంగాణలో ఆ ఉప్పు బీజేపీతో కలిసి..ఇక్కడ టీడీపీతో కలుస్తాడు. లోకేశ్ ఒక పప్పు..పవన్ ఒక ఉప్పు..సమాజానికి వీరు ముప్పు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో టీడీపీకి నైతిక విలువలు లేకుండా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

వైసీపీ బీసీల పార్టీ

ఇది బీసీల ప్రభుత్వం..పేదవాడి జీవన ప్రమాణాన్ని పెంచడమే జగన్‌ లక్ష్యం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. మీరు రాసిన రాతలు నమ్మి ప్రజల జీవితాలు మళ్లీ వెనక్కు వెళ్లాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. వాళ్లెప్పుడూ బానిసలుగా, ప్రలోభాలకు లొంగిపోయేవారిగా ఉండాలని మీ కోరిక అంటూ ధ్వజమెత్తారు.‘నేను స్పష్టంగా చెప్తున్నా..ఇది బీసీల ప్రభుత్వం..ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వం. పేదవాడి జీవన ప్రమాణాన్ని మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. అది ఇప్పుడు సిద్ధించింది..పేదలకు వచ్చిన భరోసానే మా ప్రభుత్వానికి దీవెన. అందుకే మేం సాధికార యాత్ర చేస్తుంటే జనం ప్రభంజనంలా వస్తున్నారు. దాన్ని కూడా తట్టుకోలేక జనమే లేరని ఫోటోలు వేస్తున్నావు. వేలాదిగా వచ్చిన జనం నిజం కాదా? నువ్వు చెప్పిందే ప్రజలు నమ్మాలా? కులగణనను చూసి టీడీపీ కూసాలు కదిలి..నడవలేని స్థితిలోకి పడిపోయింది. బడుగు బలహీనవర్గాల చైతన్యంతో జగన్‌కి బ్రహ్మరథం పడుతుంటే...టీడీపీ కుప్పకూలిపోతోంది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.

Advertisement

Next Story