లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఎఫెక్ట్.. 16 మంది ఎంపీలకు త్రీలైన్ విప్ జారీ చేసిన టీడీపీ

by Satheesh |   ( Updated:2024-06-25 16:18:03.0  )
లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఎఫెక్ట్.. 16 మంది ఎంపీలకు త్రీలైన్ విప్ జారీ చేసిన టీడీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ స్పీకర్ ఎన్నిక రేపు (బుధవారం) జరగనుంది. అధికార ఎన్డీఏ కూటమికి పోటీగా ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దింపడంతో తొలిసారి లోక్ సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన టీడీపీ ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. 16 మంది ఎంపీలకు టీడీపీ పార్లమెంట్ విప్ హరీష్ బాలయోగి మంగళవారం త్రీలైన్ విప్ జారీ చేశారు. బుధవారం తప్పకుండా లోక్ సభకు హాజరు అయ్యి, ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని ఆదేశించారు.

స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ కూటమి బలపర్చిచిన అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ఎంపీల భేటీకి ఆ పార్టీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9.30 గంటలకు శ్రీకృష్ణదేవరాయల నేతృత్వంలోని టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ భేటీకి జనసేన, బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానించారు. స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు శ్రీకృష్ణదేవరాయలు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ అనంతరం టీడీపీ ఎంపీలు అంతా కలిసి పార్లమెంట్‌కు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొననున్నారు.

Advertisement

Next Story