అభయహస్తం దరఖాస్తుల్లో కరెక్షన్ల కోసం పడిగాపులు.. ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్

by Anjali |
అభయహస్తం దరఖాస్తుల్లో కరెక్షన్ల కోసం పడిగాపులు.. ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్
X

దిశ, కొత్తూరు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల అమలుకోసం అర్హుల నుంచి గత ఏడాది డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేసి ఎంతో పకడ్బందీగా స్వీకరణ, ప్రజాపాలన గ్రామ సభలను పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా దరఖాస్తులు అందజేసేందుకు పంచాయతీ కార్యాలయాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాల కోసం ఆశావహులు భారీగానే దరఖాస్తులను అందించారు. మండలంలో అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి స్వీకరించిన ఈ దరఖాస్తులను ప్రభుత్వం ప్రత్యేక బృందం ద్వారా ఆన్లైన్ డాటా ఎంట్రీ చేయించింది.

కాగా, ప్రత్యేక బృందం నిర్లక్ష్యం వల్లనో, లబ్ధిదారులు వారి వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్లనో చాలా మంది ఆరు సంక్షేమ పథకాల అమలుకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాల సవరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తప్పులు దొర్లిన దరఖాస్తులను సవరించేందుకు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో సవరణల కోసం ప్రజలు తరలివస్తున్నారు. ముఖ్యంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి కింద రూ.500 వంట గ్యాస్ పంపిణీ లబ్ధి కోసం వస్తున్నారని అధికారులు తెలిపారు.

తప్పుల సవరణకు పడిగాపులు..

తప్పుల సవరణ కోసం వస్తున్న వారికి ఏయే పత్రాలు తెచ్చుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు దరఖాస్తులోని తప్పులను సవరించడానికి చాలా సమయం పట్టడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తున్నది. చాలా సందర్భాల్లో సర్వర్లు పని చేయకపోవడం కొంత విసుగు చెంది అనేక మంది సవరణలు చేయించుకోకుండా వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా తప్పుల సవరణ కోసం ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి ఒక ప్రత్యేక క్యాబిన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నామని, మళ్లీ మళ్లీ రావాలంటే తిప్పలవుతున్నదని వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed