ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టిన విశ్రాంత ఉద్యోగి.. ఆన్ లైన్లో అమ్మకం

by Rani Yarlagadda |
ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టిన విశ్రాంత ఉద్యోగి.. ఆన్ లైన్లో అమ్మకం
X

దిశ, నెల్లూరు సిటీ: పౌరసరఫరాల శాఖలో పనిచేసిన ఓ విశ్రాంత ఉద్యోగి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టాడు. నకిలీ పట్టాలు సృష్టించి ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. నెల్లూరు వేదాయపాలెం చంద్రమౌళి నగర్ ఐదో వీధిలో సర్వేనెంబర్ 78/2 లో 42 అంకణాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ శాఖతో సత్సంబంధాలు ఉన్న సదరు విశ్రాంత ఉద్యోగి, ఒక్కో ప్లాటు 9 అంకణాల చొప్పున విభజించి తమ కుటుంబీకుల పేరున నకిలీ పట్టాలు సృష్టించాడు. అక్కడ అంకణం సుమారు రెండున్నర లక్షలపై మాటే ఉంది. ప్లాట్ నెంబర్లు 179ఏ, 179బీ, 179సీగా తన పేరుపైనే నమోదు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ భూమిని ఆన్ లైన్‌లో విక్రయానికి పెట్టాడు. ఈయన సూచించిన అంకణం ధర రూ.2,75,000. ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన ఆ విశ్రాంత ఉద్యోగి గతంలో వైసీపీకి కొమ్ముకాశాడని విమర్శలు ఉన్నాయి.

సమాచార హక్కు చట్టంతో బట్టబయలు..

ఈ స్థలం వ్యవహారంలో అనుమానం వచ్చిన ఓ వ్యక్తి ఆ పట్టా ప్లాట్ నెంబర్లు, రెవెన్యూ రికార్డు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనిపై ఎలాంటి రికార్డు లేదని అధికారులు ధ్రువీకరిస్తూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విశ్రాంత ఉద్యోగి నకిలీ పట్టాల బాగోతం వెలుగులోకి వచ్చింది. అధికారులు స్పందించి కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కలెక్టర్ ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేపడితే పూర్తి డొంక కదులుతుంది.

Advertisement

Next Story