Mla Prasannakumar Reddy: పిల్లిని చూసి సింహం వణుకుతుందా?

by srinivas |   ( Updated:2023-03-25 11:00:56.0  )
Mla Prasannakumar Reddy: పిల్లిని చూసి సింహం వణుకుతుందా?
X
  • జగన్ చంద్ర బాబుకి భయపడతాడా.. ?
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీని తొక్కిపడేస్తారు
  • ఇది దేవుడిచ్చే తీర్పు
  • కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధర్మంగా ఒక స్థానం గెలుపొందితే టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆక్షేపించారు. కోవూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీని చూసి సీఎం జగన్ గజగజ వణికిపోతున్నాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సింహం పిల్లిని చూసి వణుకుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకి జగన్ భయపడతాడా? అని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు సిగ్గుందా?, బుద్ధి ఉందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అసలు మనిషేనా అని ధ్వజమెత్తారు.

పులివెందులలో సింహం కడుపున వైఎస్ జగన్ పుట్టాడని... సింహం సింహంలాగే ఉంటుంది కానీ ఎప్పటికీ పిల్లి కాదన్నారు. అలాగే పిల్లికి సింహం ఎప్పుడూ భయపడదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఎవరికీ భయపడరని... కేవలం దేవుడికి స్వర్గంలో ఉన్న దివంగత వైఎస్ఆర్‌కు మాత్రమే భయపడతారని ఎమ్మె్ల్యే ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తొక్కిపడేస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజలే టీడీపీని తొక్కిపడేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీని తొక్కిపడేస్తారంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.

‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీకి ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ సస్పెండ్ చేశారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?’ అని సవాల్ విసిరారు. ‘వైఎస్ జగన్‌కు ధైర్యం ఉంది..ప్రజల ఆశీర్వాదం ఉంది. అందుకే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. ఇది దేవుడి ఇచ్చే తీర్పు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా దత్తపుత్రుడితో కాపురం చేసి ఎలక్షన్స్‌కు వెళ్లినా ప్రజలు నమ్మరు. ఆదరించరు.’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story