- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీనంతటికీ కారణం యువ ధిక్కారమేనా..?
దిశ, ఏపీ బ్యూరో: వై నాట్175 అని సీఎం జగన్అంటుంటే.. నో.. ఓన్లీ 75 అంటున్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి పట్టభద్రులు వైసీపీకి చుక్కలు చూపించారు. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించారు. పశ్చిమ రాయలసీమలో వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మూడు నియోజకవర్గాల్లోనూ రెండో ప్రాధాన్య ఓటుతోనే విజయం కైవసం చేసుకోనున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. బోగస్ఓట్లు చేర్పించినా అధికార పార్టీ పప్పులుడకలేదు. ఓట్లు వేసిన సుమారు ఎనిమిది లక్షల మంది గ్రాడ్యుయేట్లు వైసీపీ మీద ఎందుకింత అసంతృప్తిని వెళ్లగక్కారనే దానిపై ఆ పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను స్వల్ప తేడాతో వైసీపీ దక్కించుకుంది. ప్రధాన ఉపాధ్యాయ సంఘాల అనైక్యత వైసీపీ విజయానికి దోహదపడినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
నాడు అండగా...
గత ఎన్నికలకు ముందు యువతలో ఎంతో నైరాశ్యం నెలకొంది. నిరుద్యోగం పట్టి పీడించింది. ఉపాధి కోసం గ్రామీణ యువత వలస బాట పట్టేది. ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్జనంలోకి వచ్చారు. వైసీపీ అధికారానికి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్నారు. రెండున్నర లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే భరోసా ఇచ్చారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం. తద్వారా భారీ పరిశ్రమలు వస్తాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయంటూ పట్టభద్రుల్లో ఓ విశ్వాసాన్ని పాదుకొల్పారు. సంక్షేమ పథకాల ద్వారా వాళ్ల కాళ్లమీద బతికేట్లు చేస్తామని యువతలో ఎన్నో ఆశలు రేకెత్తించారు. అందుకే వైసీపీకి భారీ విజయాన్ని అందించడంలో యువత కీలక పాత్ర పోషించింది.
ఆశలన్నీ అడియాశలు...
వైసీపీ సర్కారుపై యువత పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 1.30 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. నిన్నమొన్నటిదాకా వాళ్లంతా అరకొర వేతనాలతో పనిచేశారు. ఉద్యోగాలు రాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులు కనీసం స్వయం ఉపాధితో కొంతమేర నెట్టుకొచ్చేది. సీఎం జగన్గద్దెనెక్కినప్పటి నుంచి ఆయా సంక్షేమ శాఖలు వట్టిపోయాయి. ఆ శాఖల నిధులన్నీ నవరత్నాలకు మళ్లించారు. మెగా డీఎస్సీ హామీ నెరవేరలేదు. దీనికి ప్రతిగా ఉపాధ్యాయులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఇంకా ఓ నినాదంగానే మిగిలిపోయింది. సాధన కోసం పోరు సలిపిందీ లేదు. ఆశించిన రీతిలో పరిశ్రమలు రాలేదు. దీంతో యువతలో ఆక్రోశం తారస్థాయికి చేరింది.
మార్పు వైపు పట్టభద్రులు...
ఓవైపు ఉపాధి అవకాశాలు పెరగకపోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలకు మించిన భారాలు మోపాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకున్నా పెట్రోలు, డీజిల్ధరల పెంపు సగటు కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి. జీఎస్టీ పన్నులు బాదేయడంతో నిత్యావసరాల ధరలు ఒకటికి రెండు రెట్లు పెరిగాయి. సగటు పౌరుడి రోజువారీ జీవనానికి అప్పులు చేయాల్సిన దుస్థితికి నెట్టేశాయి. ప్రభుత్వం అందించే నగదు బదిలీ పథకాలు ఈ భారాల ముందు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత స్వయం ఉపాధికి చోటే లేదు. చివరకు కేంద్రం నుంచి వచ్చే నిధులనూ మళ్లించేశారు. ఇవన్నీ సామాన్య యువతలో తీవ్రమైన అసంతృప్తికి దారితీశాయి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే భావన ఏర్పడింది. వీళ్లుగాక ప్రభుత్వ ఉద్యోగులూ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మార్పును కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అధికార పార్టీకి గుణపాఠంగా...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ పీడీఎఫ్అభ్యర్థులే విజయం సాధించేవారు. ఈ దఫా యూటీఎఫ్, ఏపీటీఎఫ్లాంటి ప్రధాన యూనియన్లు విడిపోయి వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో ఉపాధ్యాయుల ఓట్లలో చీలిక అధికార పార్టీకి కలిసొచ్చింది. ఆది నుంచి ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు హక్కు కల్పించడానికి యాజమాన్యాలు సహకరించేవి కావు. ఉపాధ్యాయ సంఘాలు కూడా పెద్దగా పట్టించుకునేది లేదు. ఈ దఫా అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు వీళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. యాజమాన్యాలతో మాట్లాడి ఓటు హక్కు కల్పించడంలో సక్సెస్అయ్యారు. అయినా పీడీఎఫ్అభ్యర్థులు తీవ్ర పోటీనిచ్చారు. చివరకు చావు తప్పి కన్ను లొట్టబోయిన సామెతగా స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి ఓ గుణపాఠంగా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ ఆత్మావలోకనం చేసుకోకుంటే సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: నేల మీద నడిస్తే ఓటమి ఎలా?