Cyclone Fengal: 12 గంటల్లో తుపాన్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

by Rani Yarlagadda |
Cyclone Fengal: 12 గంటల్లో తుపాన్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం (Deep Depression) నెమ్మదిగా కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. ట్రింకోమలీకి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటల్లో ఇది శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర - వాయువ్య దిశగా పయనిస్తుందని, రేపు ఉదయం లోగా తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా (South Coastal Area)లో అక్కడక్కడా మూడు రోజులపాటు భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో విస్తారంగా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. శనివారం దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed