ఉండి టీడీపీ టికెట్‌పై రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
MP Raghu Ramakrishnam Raju
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లైన్ క్లియర్ అయింది. గత ఎన్నికల్లో రఘురామరాజు వైసీపీ తరపున పోటీ చేసి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీని విభేదించి రెబల్ ఎంపీగా మారారు. ఈసారి ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

అయితే అనూహ్యంగా రఘురామరాజుకు బీజేపీ నుంచి సీటు దక్కలేదు. దీంతో ఆయన అభ్యర్థిత్వంపై కొంతకాలం సస్పెన్స్ కొనసాగింది. చివరకు టీడీపీ నుంచి రఘురామ రాజు టికెట్ దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి స్థానంలో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ నియోజకరవర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగిసి పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ నియోజకవర్గంలో వర్గ విబేధాలు తలెత్తాయి. అయితే శివరామరాజును చంద్రబాబు ఒప్పించారు. రామరాజుకే సీటు ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటనతో ఉండి టీడీపీలో వర్గ విబేధాలు ముగిశాయి.

అయితే నామినేషన్ల వేళ అనూహ్య పరిణామం జరిగింది. ఉండి నియోజకవర్గం అభ్యర్థి రామరాజును మార్చి అదే సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు. దీంతో సోమవారం నామినేషన్ వేసేందుకు రఘురామరాజు సిద్ధమవుతున్నారు. బీఫామ్ తీసుకుని ఉండిలో తాను నామినేషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, రామరాజు, తాను కలిసే ముందుకు వెళ్తామని చెప్పారు. తాను ఎంపీ స్థానాన్ని ఆశించానని, ఎమ్మెల్యే అయినా పర్వాలేదని తెలిపారు. ఎంతమంది వచ్చినా ఉండిలో తన గెలుపును ఆపలేరని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed