ఎంత చేసినా బువ్వకు రావట్లే !

by srinivas |
ఎంత చేసినా బువ్వకు రావట్లే !
X
  • రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆ పూటకే.
  • కునారిల్లుతున్న వ్యవసాయ కూలీల బతుకులు
  • పంటల మార్పు, యాంత్రీకరణతో తగ్గుతున్న పని దినాలు
  • గుడ్డిలో మెల్లగా ఆదుకుంటున్న ఉపాధి హామీ పనులు
  • అయితే కౌలు రైతులు.. లేకుంటే అసంఘటిత రంగ కార్మికులుగా వలసలు

తాజమహల్ ​కట్టిందెవరంటే టక్కున చెప్పేస్తాం. అలాంటి అపురూప కట్టడానికి రాళ్లెత్తిన కూలీలెవరో తెలీదు. శారీరక శ్రమంటే చులకన భావం కావొచ్చు. విలువ లేనిదిగా మార్చిన పాలకుల విధానాలు అయ్యుండొచ్చు. నేడు గుప్పెడు మెతుకులు పండించింది ఎవరంటే రైతులంటాం. రెక్కలు ముక్కలు చేసుకొని చెమటను ధాన్యంగా మార్చిన వ్యవసాయ కూలీలని చెప్పం. సమాజంలో ఏమాత్రం గౌరవం లేదు. అయినా బతుకు దెరువుకు మరో మార్గం లేదు. ఏ పూటకు ఆ పూట నెట్టుకొస్తున్న వ్యవసాయ కూలీల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. కనీస వేతన చట్టాలు అమలు కావు. ఆదరించే దిక్కు లేక చాలా మంది అసంఘటిత కార్మికులుగా వలసలు పోతున్నారు. కొందరు కౌలు రైతులవుతున్నారు. ఈ రెండూ కాని వాళ్లు గ్రామాల్లో అలాగే చావలేక బతుకుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: అది ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ చిన్న పల్లె. అక్కడ రెండు వందల వ్యవసాయ కూలీ కుటుంబాలుంటాయి. ఏడాది క్రితం పనికెళ్లి వస్తూ అతను బండిపై నుంచి కిందపడి కాళ్లు విరిగాయి. మంచానికే పరిమితమయ్యాడు. ఇద్దరి పిల్లలతోపాటు కుటుంబ భారం భార్య మీద పడింది. సెంటు భూమి లేదు. తలదాచుకునే పక్కా ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తుల్లేవు. పని దొరికినప్పుడు వెళ్తోంది. కుటుంబ అవసరాలకు చాలడం లేదు. ఊళ్లో ప్రతి ఒక్కడి కళ్లు ఆమె పైనే. యోగక్షేమాలు అడిగితే.. కన్నీళ్లే ఆమె కష్టాలను కథలు కథలుగా చెప్పాయి. ఇక ఆ ఊళ్లో ఒక్కో కూలీ కుటుంబానిది ఒక్కో వ్యధ. ఎవరికీ పట్టని బతుకులయ్యాయి. వలస పోతే తప్ప బతకలేమంటున్నాయి. బతకడానికి అప్పులైతే చావే దిక్కంటున్నాయి.

రాష్ట్రంలో సుమారు 1.20 వ్యవసాయ కూలీల కుటుంబాలున్నాయి. ఏడాదిలో పట్టుమని ఆర్నెల్లు కూడా పనులు దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ వేతనం రూ.634. అది ఎక్కడా అమలు కాదు. ప్రస్తుతం వ్యవసాయ కూలీల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు రోజుకు రూ.250 నుంచి రూ.300 దాకా వేతనం అందుతోంది. పంట పండించే రైతుకు అంతగా ఆదాయం దక్కడం లేదు కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన వేతనం ఇవ్వలేరని ప్రభుత్వ అధికారులే చెబుతుంటారు. కూలీల ఖర్చు పెరుగుతుందనో, సంప్రదాయ రైతు కుటుంబాల్లో వ్యవసాయం చేసే వారసులు లేకనో పంటల్లో మార్పులొచ్చాయి. కూలీల అవసరం లేని సుబాబుల్​, జామాయిల్​తోటల సాగు పెరిగింది. వరి సాగు క్రమేణా తగ్గుతోంది. ఇతర వాణిజ్య పంటల సాగులోనూ యాంత్రీకరణ పెరిగింది. దీంతో వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గాయి.


వ్యవసాయ కూలీల్లో ఎక్కువ భాగం ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలే ఉన్నారు. కొద్దోగొప్పో భూవసతి ఉన్నోళ్లు మరికొంత కౌలుకు తీసుకొని కౌలు రైతుల అవతారమెత్తుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతినడం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో మరుసటి ఏడాది పట్టణాలు, నగరాల్లో అసంఘటిత కార్మికులుగా మారిపోతున్నారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా అప్పుల కింద పోతోంది. ఉన్న ఊళ్లో చాలినంత పని దొరక్క కొందరు పిల్లలు, వృద్ధులను ఇంటిదగ్గర వదిలేసి ఆర్నెల్లపాటు వలసపోతున్నారు. ఇంకొందరు పూట గడవక అప్పుల పాలై ఊరొదిలి అర్బన్‌లో​మురికివాడలకు చేరుతున్నారు.

ప్రస్తుతం ఉపాధి హామీ పనులే కొంతమేర ఆలంబనగా నిలుస్తున్నాయి. కనీసం వంద రోజులకు తగ్గకుండా పనులుంటాయి. రోజుకు రూ.257 వేతనం అందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కూలీలకు ఇచ్చే పని క్యూబిక్ మీటర్ల కొలతల్లో ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి, కూలీల వంట్లో శక్తిని బట్టి వాళ్లకు రూ.180 నుంచి రూ.220 మాత్రమే దక్కుతున్నట్లు క్షేత్రస్థాయి అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ఇందులో అవినీతి అక్రమాలు చెప్పనలవి కావు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కూలీల జాబ్​కార్డులుంటాయి. పనులు జరిగేది యంత్రాలతో అయితే కూలీలతో చేయించినట్లు నమోదు చేస్తారు. అధికారులతో వాటాలేసుకొని పంచుకోవడం సహజంగా మారిపోయింది.

సంక్షేమ పథకాలు ఎందుకూ కొరగావడం లేదు

– కంకణాల ఆంజనేయలు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి

గ్రామీణ జీవనంలో అధిక సంఖ్యాకులుగా ఉండేది వ్యవసాయ కూలీలే. ప్రభుత్వం చేయూత పథకం కింద ఏటా రూ.18,750 అందిస్తోంది. అది కూలీల బతుకుల్లో వెలుగులు నింపలేదు. ఊళ్లో అందరి పిల్లలకు వచ్చినట్టే అమ్మ వడి, ఫీజు రీయింబర్స్​మెంటు, విద్య, వసతి దీవెన పథకాలు అందుతున్నాయి. అయినా నిరంతరం పెరుగుతున్న జీవన వ్యయం ముందు ఇవి ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్పందీగా అమలు చేయాలి. కేవలం కూలీలతోనే పనులు చేయించేట్లుండాలి. ఏడాదిలో కనీసం ఆర్నెల్లపాటు పనులుండాలి. ప్రస్తుత నిత్యావసర ధరలను బట్టి వేతనాలు అందించేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

మూడు రెట్లు పెరిగిన కూలీల ఆత్మహత్యలు

- కేంద్ర మంత్రి నిత్యానందరాయ్​

రాష్ట్రంలో రోజువారీ కూలీల ఆత్మహత్యలు మూడింతలు పెరిగినట్లు రెండు రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్​ వెల్లడించారు. 2021లో 3014 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2014తో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో మొత్తం 6,475 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు మంత్రి తెలిపారు. గడచిన మూడేళ్లలో కూలీల బలవన్మరణాలు 19 శాతం పెరిగినట్లు మంత్రి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed