చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం: టీడీపీ వర్సెస్ వైసీపీ

by Seetharam |
చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం: టీడీపీ వర్సెస్ వైసీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు అనారోగ్యంపై వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఒకానొక సందర్భంలో చంద్రబాబుకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఇంకొందరైతే ఇన్ని రోగాలున్న మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ చంద్రబాబును దెప్పిపొడుస్తున్నారు. మరికొందరైతే చంద్రబాబు నాయుడు మరో ఐదేళ్లపాటు బతకాలని సెటైర్లు వేస్తున్నారు. ఇంకొక మంత్రి అయితే చంద్రబాబు నాయుడు పదికాలాలపాటు చల్లగా ఉండాలంటూ కోరుకుంటున్నారు. ఇలా ఒక ప్రతిపక్ష నేత అనారోగ్యంతో బాధపడుతుంటే సానుభూతి చూపించాల్సింది పోయి ఆ అనారోగ్య సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం దురదృష్టకరమని టీడీపీ అంటుంది. అంతేకాదు మరో ఐదేళ్లపాటు బాబు బతకాలంటూ వ్యాఖ్యానించడంపై మండిపడుతుంది. అసలు మీరు మనుషులేనా అంటూ ప్రశ్నిస్తోంది. ఇలాంటి తరుణంలో అసలు చంద్రబాబు నాయుడుకు ఉన్న అనారోగ్య సమస్యలు ఏంటని ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. చంద్రబాబు నాయుడు 73 ఏళ్ల వయసులో 37ఏళ్ల యువకుడిలా పరుగులు పెడుతున్నారంటూ టీడీపీ ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటుంది. అంతేకాదు తనలా వైఎస్ జగన్ కష్టపడగలరా అంటూ కూడా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు చంద్రబాబును అనారోగ్యసమస్యలు కమ్మేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

జైల్లో బయటపడ్డ సమస్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ స్కిన్ ఎలర్జీ కారణంగా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 53 రోజులుగా చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెుదటి నుంచి ఎదుర్కొంటున్న అలర్జీ సమస్యలతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలను వైద్యులు గుర్తించారు. 73ఏళ్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తానెంతో ఫిట్‌గా ఉన్నానంటూ ప్రకటనలు చేస్తుంటారు. తాను ఫిట్‌గానే ఉన్నానని..తాను యువకుడిలా పరుగులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తన మాదిరిగా వైఎస్ జగన్ పరుగులు పెట్టగలరా..? కష్టపడగలరా అంటూ చంద్రబాబు నాయుడు ఛాలెంజ్‌లు చేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మెుత్తం సీన్ మారిపోయింది. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తర్వాత ఆయనను అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి అని తేలింది. ఈ మేరకు వైద్యులు నివేదిక అందించారు. చంద్రబాబుకు కంటి సమస్యలతో బాధపడుతున్నారని ఈ నేపథ్యంలో కుడి కంటి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో తాజాగా కుడికంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిన సమయంలోనే మూడు నెలల్లో కుడి కంటికి కూడా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో అది సాధ్యపడలేదు. దీంతో ఆపరేషన్ తేదీ దాటిపోవడంతో కంటి సమస్యలు తీవ్రమయ్యాయని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

బాధిస్తోన్న వెన్నునొప్పి

చంద్రబాబుకు చాలాయేళ్లుగా చర్మ సంబంధిత సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సెంట్రల్ జైలులో ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌తో అవి మరింతగా పెరిగాయి. చంద్రబాబు వీపు, నడుము, చాతి, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడినట్లు వైద్యలు వెల్లడించారు. చంద్రబాబు రెండు అరచేతుల్లో పుండ్లు ఏర్పడి అవిచితికి పోవడంతో దురద వస్తున్నట్లు జీజీహెచ్ వైద్య నిపుణులు జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. ఈ కారణంగానే కోర్టు చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. ఏసీ ఏర్పాటుతో డిహైడ్రేషన్ తగ్గినా.. చర్మ సమస్యలు మాత్రం తగ్గలేదని వైద్యులు సూచించారు.ఇక చంద్రబాబుకు వెన్నునొప్పి కూడా బాధిస్తోందని తెలుస్తోంది. దీంతో ఆయనను పరీక్షించిన వైద్యులు ఒకే పొజిషన్ ఎక్కువసేపు కూర్చోవద్దని.. సౌకర్యవంతంగా ఉండే విధంగా కూర్చోవాలని సూచించారు. అలాగే ఫిషర్ సమస్యతో కూడా చంద్రబాబు నాయుడు బాధపడుతున్నట్లు తెలిసింది.వీటితోపాటు బీపీ, షుగర్ లాంటి రెగ్యులర్ ఆరోగ్య సమస్యలు కూడా చంద్రబాబును వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు జైలులో చంద్రబాబు నాయుడు బరువు తగ్గారని కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మరింత తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అనారోగ్యంపై రాజకీయం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాయి. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను వైసీపీ దెప్పిపొడుస్తోంది. చంద్రబాబుకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని ఇక ఆయన రాష్ట్రానికి, రాజకీయానికి పనికిరాడంటూ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అంతేకాదు ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ నిలదీశారు. అలాగే చంద్రబాబు నాయుడు చస్తాడు అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు చేశారు. ఆ విమర్శలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగి వచ్చిన ఎంపీ చంద్రబాబు మరోఐదేళ్లు బతకాలంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సైతం చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలు చాలా దారుణమని టీడీపీ అంటుంది. ఇలాంటి తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని చంద్రబాబు పదికాలాలపాటు చల్లగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ మనుషులకు ఆరోగ్య సమస్యలు రావడం సహజమేనని అలాంటిది వాటిని కూడా రాజకీయం చేస్తారా అంటూ టీడీపీ మండిపడుతుంది.

Advertisement

Next Story